Covid During 3rd Wave in India: కరోనా వ్యాక్సిన్ మూడో డోసు తీసుకోవడం వల్ల సమర్థవంతమైన ఫలితాలు వస్తున్నట్లు అంతర్జాతీయ అధ్యయనాలు వెల్లడిస్తోన్నాయి. ఈ క్రమంలో భారత్‌లోనూ బూస్టర్ డోసు (ప్రికాషనరీ) తీసుకున్న 70శాతం మంది మూడో వేవ్‌లో వైరస్ బారిన పడలేదని తాజా అధ్యయనం వెల్లడించింది. అంతేకాకుండా కొవాగ్జిన్, కొవిషీల్డ్ రెండు డోసుల ఫలితాలు ఒకే మాదిరిగా కనిపించినట్లు తెలిపింది. ప్రికాషనరీ డోసు పేరుతో కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న వ్యాక్సిన్ తీసుకున్న దాదాపు 6వేల మందిపై జరిపిన అధ్యయనంలో పలు విషయాలు వెల్లడయ్యాయి.
థర్డ్‌వేవ్ సమయంలో మూడో డోసు పనితీరుపై ఇండియన్ మెడికల్ ఆసోసియేషన్ ఏర్పాటు చేసిన నేషనల్ టాస్క్‌ఫోర్స్ అధ్యయనం చేపట్టింది. ఇందులో భాగంగా వ్యాక్సిన్ తీసుకున్న 5971 మందిని సర్వే చేసింది. వీరిలో 2383 మంది బూస్టర్ డోసు తీసుకోగా కేవలం 30శాతం మంది మాత్రమే మూడోవేవ్‌లో కరోనా బారినపడ్డారు. వీరిలో ఎక్కువగా ఆరోగ్య కార్యకర్తలే ఉన్నట్లు తాజా అధ్యయనం పేర్కొంది. రెండో డోసు తీసుకున్న సుదీర్ఘకాలం తర్వాత బూస్టర్ తీసుకున్న వారే మూడోవేవ్‌లో వైరస్ బారినపడినట్లు గుర్తించామని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ రాజీవ్ జయదేవన్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఆరు నెలలకంటే ముందు బూస్టర్‌ను ఇవ్వడం వల్ల ఇన్‌ఫెక్షన్ రేటులో ఎటువంటి తేడా లేదన్నారు.
ఆ వయసువారిలోనే ఎక్కువ..:మూడోవేవ్‌లో అధికంగా 40ఏళ్ల వయసుకంటే తక్కువ ఉన్నవారే కరోనా బారినపడ్డారని తాజా అధ్యయనం పేర్కొంది. వారిలో 45శాతం మందికి మూడో వేవ్‌లో వైరస్ సోకినట్లు తెలిపింది. దాదాపు 39.6శాతం మంది 40 నుంచి 59ఏళ్ల వయసు వారుకాగా, వైరస్ బారినపడిన వారిలో 60 నుంచి 79ఏళ్ళ వయసు వారు 31.8శాతం ఉన్నారు. మరో 21.2 శాతం మాత్రమే 80ఏళ్లకు పైగా వయసున్న వారు ఉన్నట్లు తాజా అధ్యయనంలో అంచనా వేశారు. థర్డ్‌వేవ్‌లో వైరస్ బారినపడిన 2311 మందిలో కేవలం 4.8శాతం మందిలోనే లక్షణాలు కనిపించాయి. మరో 53శాతం మందికి స్వల్ప లక్షణాలు ఉండగా, 41.5శాతం మందిలో సాధారణ లక్షణాలున్నాయి. కేవలం 0.69శాతం బాధితులే తీవ్ర వ్యాధి బారిన పడినట్లు తాజా అధ్యయనం గుర్తించింది.
కొవాగ్జిన్, కొవిషీల్డ్ ఒకే మాదిరి..:దేశంలో గతేడాది డిసెంబర్‌లో మొదలైన మూడోవేవ్ ప్రభావం ఈఏడాది మార్చి వరకు కొనసాగింది. ఈ సమయంలో ఇన్‌ఫెక్షన్, ఆస్పత్రి చేరికలు, మరణాలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా జనవరి 10 నుంచి ఫ్రంట్‌లైన్ వర్కర్లతోపాటు 60ఏళ్ల వయసుపైబడిన వారికి ప్రికాషనరీ డోసు పేరుతో కేంద్ర ప్రభుత్వం మూడో డోసును అందజేసే కార్యక్రమం మొదలుపెట్టింది. ఇలా కొవాగ్జిన్, కొవిషీల్డ్ తీసుకున్న వారిలో థర్డ్‌వేవ్ సమయంలో ఇన్‌ఫెక్షన్ రేటు ఒకేవిధంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. సర్వేలో పాల్గొన్న వారిలో 5157 మంది కొవిషీల్డ్ తీసుకోగా వారిలో 2010 (39శాతం) మంది వైరస్ బారినపడ్డారు. మరో 523 మంది కొవాగ్జిన్ తీసుకోగా వారిలో 210 (40శాతం) మందికి వైరస్ సోకింది. ఇదిలాఉంటే, సర్వేలో పాల్గొన్న సుమారు ఆరు వేల మందిలో 24శాతం మంది 40ఏళ్ల కంటే తక్కువ ఉన్నవారే. 50శాతం మంది 45 నుంచి 59ఏళ్ల వయసున్న వారు. సర్వే చేపట్టిన మొత్తం మందిలో 45శాతం మహిళలు ఉండగా.. అందులో 53శాతం ఆరోగ్యకార్యకర్తలు ఉన్నారు.
ఇదీ చదవండి:పిల్లల కోసం మూడు వ్యాక్సిన్లు- డీసీజీఐ అనుమతి