తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Civils Results 2021: అమ్మాయిలకు శిరస్సు వంచిన సివిల్స్ - సివిల్స్​ రిజల్ట్స్ 2021

సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్స్‌-2021 ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. వరుసగా తొలి మూడు స్థానాలూ వారే సొంతం చేసుకున్నారు. మరోవైపు తెలుగు అభ్యర్థులూ తమ ప్రతిభను చాటారు. వందలోపు ర్యాంకుల్లో పది మంది నిలిచారు.

Civils Results 2021: అమ్మాయిలకు శిరస్సు వంచిన సివిల్స్
Civils Results 2021: అమ్మాయిలకు శిరస్సు వంచిన సివిల్స్

By

Published : May 31, 2022, 5:56 AM IST

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్స్‌-2021లో ఫలితాల్లో తొలి మూడు ర్యాంకులూ అమ్మాయిలే సొంతం చేసుకున్నారు. శ్రుతి శర్మ టాప్‌ ర్యాంకు కైవసం చేసుకోగా, రెండు, మూడు స్థానాల్లో అంకితా అగర్వాల్‌, గామినీ సింగ్లా నిలిచారు. తెలుగు అభ్యర్థులూ సివిల్స్‌లో సత్తా చాటారు. వందలోపు ర్యాంకుల్లో పది మంది నిలిచారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి కనీసం 40 మంది సివిల్స్‌కు ఎంపికైనట్లు ప్రాథమిక సమాచారం. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూలను దాటుకొని ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐపీఎస్‌, సెంట్రల్‌ సర్వీస్‌ గ్రూప్‌-ఏ, బి పోస్టులకు మొత్తం 685 మంది ఎంపికయ్యారు. ఇందులో జనరల్‌ కోటాలో 244, ఈడబ్ల్యూఎస్‌లో 73, ఓబీసీలో 203, ఎస్సీ కోటాలో 105, ఎస్టీల్లో 60 మంది ఉన్నారు. 2021 అక్టోబర్‌ 10న నిర్వహించిన సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్షలకు 10,93,984 మంది దరఖాస్తు చేసుకోగా, 5,08,619 (46.49%) మంది హాజరయ్యారు. 2022 జనవరిలో నిర్వహించిన మెయిన్స్‌కి అందులో 9,214 (1.81%) మంది అర్హత సాధించారు. వారిలో 1,824 (19.79%)మంది ఏప్రిల్‌-మేనెలల్లో నిర్వహించిన ఇంటర్వ్యూలకి ఎంపికయ్యారు. అందులో కమిషన్‌ మొత్తం 685 మందిని (37.55%) వివిధ సర్వీసుల్లో నియామకానికి సిఫార్సు చేసింది. వీరిలో 508 (74.16%)మంది పురుషులు, 177 (25.83%) మంది మహిళలు ఉన్నారు. సివిల్స్‌ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

*ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్‌కు చెందిన శ్రుతి శర్మకు తొలి ర్యాంకు దక్కింది. ఈమె ఐచ్ఛికాంశం (ఆప్షనల్‌ సబ్జెక్ట్‌) చరిత్ర. దిల్లీ యూనివర్సిటీ పరిధిలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో హిస్టరీ (ఆనర్స్‌)లో డిగ్రీ, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేశారు.

*రెండో ర్యాంక్‌ సాధించిన అంకితా అగర్వాల్‌.. దిల్లీ యూనివర్సిటీలో ఎకనమిక్స్‌(ఆనర్స్‌)లో డిగ్రీ చేశారు. ఈమె ఐచ్ఛికాంశాలు పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌.

*మూడో ర్యాంకర్‌ గామినీ సింగ్లా.. కంప్యూటర్‌సైన్స్‌లో బీటెక్‌ చేశారు. ఈమె ఐచ్ఛికాంశం సోషియాలజీ.

*టాప్‌ 25 ర్యాంకుల్లో 15 మంది పురుషులు, 10 మంది మహిళలు.

తెలుగు అభ్యర్థుల సత్తా..

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్‌ సర్వీసెస్‌లో మరోసారి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మంచి ప్రతిభ చూపారు. గత ఏడాది తొలి వందలో ఎనిమిది మంది తెలంగాణ, ఏపీల నుంచి ఉండగా.. ఈ సారి ఆ సంఖ్య దాటడం విశేషం. హైదరాబాద్‌ సైనిక్‌పురికి చెందిన ప్రియంవద మదాల్కర్‌ 13వ ర్యాంకు సాధించి తెలంగాణ నుంచి టాపర్‌గా నిలిచారు. 15వ ర్యాంకుతో ఆంధ్రప్రదేశ్‌ టాపర్‌గా కర్నూలు జిల్లాకు చెందిన యశ్వంత్‌కుమార్‌రెడ్డి నిలిచారు. ఈ సారి మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు ఎక్కువగా సివిల్స్‌లో విజయం సాధించడం గమనార్హం. భూపాపల్లిలో వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆకునూరి నరేష్‌, కరీంనగర్‌ నగరంలో కానిస్టేబుల్‌ రాంగోపాల్‌ కుమారుడు శ్రీధర్‌, జగిత్యాల జిల్లా బీర్పూర్‌ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన రైతు భాష్యనాయక్‌ కుమారుడు శరత్‌నాయక్‌ తదితరులు ఎంపికయ్యారు. అంతేకాకుండా 2020, 2021లో సర్వీస్‌కు ఎంపికైనా మరోసారి ప్రయత్నించి ఉత్తమ ర్యాంకులు సాధించినవారూ ఉన్నారు. మరోవైపు తెలుగు మూలాలున్న పలువురు ఇతర రాష్ట్రాల నుంచి విజయం సాధించారు. ఏపీలోని విశాఖపట్నానికి చెందిన అక్షయ్‌ పిళ్లై ఛత్తీస్‌గఢ్‌ నుంచి పరీక్షకు హాజరై 51వ ర్యాంకు దక్కించుకున్నారు. ఆయన విశ్రాంత ఐఏఎస్‌ ఆర్‌కేఆర్‌ గోనెల మనవడు. తొలిసారిగా ఫలితాలు విడుదల చేసిన రోజే పాస్‌ అయిన, కానివాళ్ల మార్కులు వెల్లడించడం గమనార్హం. ‘ఈసారి ఖాళీల సంఖ్య కూడా తగ్గింది. 685లో 40 మంది తెలుగు వారు ఎంపిక కావడం...అదీ టాప్‌ 100లో 10 మంది ఉండటం శుభపరిణామం’ అని సివిల్స్‌ శిక్షణ నిపుణులు గోపాలకృష్ణ, రాంబాబు అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది సివిల్స్‌ 2022కు 1,011 ఖాళీలు ఉన్నాయని, మరింత మంది ఎంపికయ్యేందుకు అవకాశం ఉందన్నారు. ఈసారి కొందరు ఇంటిగ్రేటెడ్‌ ఇంటర్‌, డిగ్రీ చదివి విజయం సాధించడం కొత్త పరిణామమని సివిల్స్‌ శిక్షణ నిపుణుడు కృష్ణప్రదీప్‌ తెలిపారు.

వార్తాపత్రికలను చూసి నోట్స్‌ రాసుకున్నా

మంచి ర్యాంకు వస్తుందనుకున్నా, తొలిర్యాంకును ఊహించలేదు. నేనేమీ కొత్త వ్యూహం అనుసరించలేదు. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను చదివాను. అయితే మెయిన్స్‌ రాసేముందు కోచింగ్‌ మెటీరియల్‌పై ఆధారపడకుండా వార్తాపత్రికల ఆధారంగా సొంత నోట్స్‌ తయారు చేసుకున్నా. అదే నాకు మేలుచేసింది. ఎన్నిగంటలు చదువుతున్నామన్నది ముఖ్యం కాదు. ఎంత నాణ్యంగా చదువుతున్నామన్నదే ముఖ్యం.

- శ్రుతి శర్మ, సివిల్స్‌ టాప్‌ ర్యాంకర్‌

రెండేళ్ల శ్రమకు తగ్గ ఫలితం

ది నా రెండో ప్రయత్నం. 2020లో పరీక్ష రాసినా.. అప్పటికి 2 నెలల ముందు నుంచే ప్రిపేర్‌ అయ్యా. ప్రిలిమ్స్‌ సాధించలేకపోయా. 2020 జులై నుంచి పూర్తిగా సివిల్స్‌పైనే దృష్టి పెట్టి చదివాను. మా తల్లిదండ్రుల స్వస్థలం ముంబయి.. కానీ, హైదరాబాద్‌లోనే స్థిరపడ్డాం. బీటెక్‌ పూర్తయ్యాక ఐఐఎం బెంగళూరు నుంచి ఎంబీఏ పూర్తిచేసి ఆరేళ్లపాటు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌లో పనిచేశాను. నాలుగేళ్ల కిందట వివాహమైంది. నా భర్త విద్యాధర్‌ శ్రీధర్‌ హైదరాబాద్‌లో స్టార్టప్‌ నడిపిస్తుండటంతో ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాం. సోషియాలజీ ఆప్షనల్‌గా ఎంచుకున్నా. ఆన్‌లైన్‌ కోచింగ్‌ తీసుకున్నా. టెస్టు సిరిస్‌లు రాశాను. ఇంటర్వ్యూ ప్రిపేర్‌ అవ్వడానికి రాచకొండ కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ సూచనలు అందించారు. ఐఏఎస్‌ అయ్యాక నీతి, నిజాయతీగా పనిచేసి సమాజానికి సేవ చేయాలనుకుంటున్నా.

- ప్రియంవద మదాల్కర్‌, 13వ ర్యాంకు, హైదరాబాద్‌

తండ్రి సన్నకారు రైతు.. తల్లి పారిశుద్ధ్య కార్మికురాలు..

ప్రతిభ ఉంటే లక్ష్యసాధనలో పేదరికం అడ్డుకాదని నిరూపించారు భూపాలపల్లికి చెందిన ఆకునూరి నరేశ్‌.. ఉండేది చిన్న పెంకుటిల్లు.. పెద్ద కుటుంబం, తండ్రి సన్నకారు రైతు.. తల్లి ఔట్‌ సోర్సింగ్‌ పారిశుద్ధ్య కార్మికురాలు.. అయితేనేం తన కన్నకలలను తల్లిదండ్రుల సహకారంతో సాధించారు.. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాశీంపల్లికి చెందిన ఆకునూరి నరేశ్‌. అయిలయ్య, సులోచన దంపతులకు ఇద్దరు కుమారులు.. చిన్నవాడు నరేశ్‌. తండ్రి అయిలయ్య వ్యవసాయం చేస్తుండగా.. తల్లి సులోచన సింగరేణిలో ఔట్ సోర్సింగ్‌ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. నరేశ్‌ ప్రాథమిక విద్య స్థానిక ప్రభుత్వ పాఠశాల, 6 నుంచి 10వ తరగతి వరకు నర్సంపేటలోని ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ పాఠశాలలో పూర్తి చేశారు. హైదరాబాద్‌ చిలుకూరు ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ కళాశాలలో ఇంటర్‌ చదివి.. ఐఐటీ ప్రవేశ పరీక్షలో 210వ ర్యాంకు సాధించారు. గ్రాడ్యుయేషన్‌ మద్రాస్‌ ఐఐటీలో పూర్తి చేసి, అక్కడే ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సాధించారు. ఉద్యోగం చేస్తూనే 2017 నుంచి సివిల్స్‌ రాస్తూ వచ్చారు. 2019లో 3వ ప్రయత్నంలో ఐఆర్‌పీఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు. 2021 ఐదో ప్రయత్నంలో సివిల్స్‌లో 117 ర్యాంకు సాధించి తన కలను సాకారం చేసుకున్నారు.

అమ్మ చేతిరాత.. మార్చింది తలరాత

దేళ్ల కిందట ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం.. కొన్ని నెలలు కష్టపడితే పట్టా చేతికి వస్తుంది.. అంతలోని అకస్మాత్తుగా ఆ విద్యార్థికి అనారోగ్యం. వైద్యులు పరీక్షించి బ్రెయిన్‌ హ్యామరేజి అని చెప్పారు. శరీరంలోని కుడిభాగం(చెయ్యి, కాలు) పక్షవాతం వచ్చినట్లు అయ్యింది. 8 రోజులు వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడారు. మరో 37 రోజులపాటు ప్రత్యేక చికిత్స. తర్వాత మూడేళ్లపాటు ఫిజియోథెరపీ. ఇలాంటి పరిస్థితుల్లో మాతృమూర్తి సహకారంతో ఆ యువకుడు సివిల్స్‌ ర్యాంకు సాధించి స్ఫూర్తిగా నిలిచారు. హైదరాబాద్‌ విద్యానగర్‌కు చెందిన బచ్చు స్మరణ్‌రాజ్‌ తాజాగా విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లో మొదటి ప్రయత్నంలోనే 676వ ర్యాంకు సాధించారు. 2017లో చెన్నై ఐఐటీలో కెమికల్‌ ఇంజినీరింగ్‌ చివరి ఏడాది చదువుతున్న సమయంలో అకస్మాత్తుగా అనారోగ్యంపాలయ్యాడు. ఇప్పటికీ వేగంగా రాయలేకపోతున్నారు. అయినా సివిల్స్‌లో రాణించాలనే చిన్నప్పటి కలను నెరవేర్చుకోవాలనే తపనతో గాంధీనగర్‌లోని సీఎస్‌బీ అకాడమీ డైరెక్టర్‌ బాలలత పర్యవేక్షణలో శిక్షణ తీసుకొన్నారు. పరీక్ష వేగంగా రాయలేకపోవడంతో యూపీఎస్సీ స్క్రైబ్‌ సాయంతో రాసేందుకు అనుమతించింది. కుమారుడి ఆశయం సాధన కోసం స్మరణ్‌రాజ్‌ తల్లి నాగరాణి స్క్రైబ్‌గా ఉండేందుకు ముందుకు వచ్చారు. దాదాపు 27 ఏళ్ల క్రితం గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారామె. అప్పట్నుంచి రాయడం తగ్గిపోయింది. కుమారుడి కోసం ఆంగ్లంలో వేగంగా రాయాలని రోజుకు నాలుగైదు గంటలు రాయడం ప్రాక్టీసు చేసేవారు. కుమారుడు చదువుతుంటే.. ఆమె రాయడం సాధన చేసేవారు. గంటకు ఎంత రాయగలనో అని.. ఎప్పటికప్పుడు పోటీ పెట్టుకుని రాసేవారు. అలా తల్లి సహకారంతో సివిల్స్‌ రాసిన స్మరణ్‌రాజ్‌ అఖిలభారత స్థాయిలో ర్యాంకు సాధించి కల నెరవేర్చుకున్నారు.

ఇప్పుడు ఐపీఎస్‌... ఇక ఐఏఎస్‌

నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం కలుగొట్లపల్లెకి చెందిన చల్లపల్లె యశ్వంత్‌కుమార్‌రెడ్డి సివిల్స్‌లో 15వ ర్యాంకు సాధించి సత్తాచాటారు. తండ్రి పుల్లారెడ్డి విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి లక్ష్మీదేవి గృహిణి. ఆయన సోదరుడు నాగదస్తగిరిరెడ్డి పీహెచ్‌డీ పూర్తి చేసి కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. యశ్వంత్‌ కాకినాడ జేఎన్‌టీయూలో బీటెక్‌ చదివి బంగారు పతకం అందుకున్నారు. అనంతరం ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీలో ఉద్యోగంలో లభించింది. 2016లో గ్రూప్‌-1 రాయగా సీటీవోగా ఎంపికయ్యారు. 2020లో సివిల్స్‌కు సన్నద్ధమవగా 93వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఐపీఎస్‌ శిక్షణలో ఉన్నారు. 2021లో మరోసారి సివిల్స్‌ రాయగా 15వ ర్యాంకు సాధించడం విశేషం.

విద్య, వైద్య రంగాలపై ఆసక్తి

పేరు: మౌర్య భరద్వాజ
ర్యాంకు: 28

అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన మంత్రి మౌర్య భరద్వాజ సివిల్స్‌లో 28వ ర్యాంకు సాధించారు. తల్లి రాధాకుమారి నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో ఫార్మసిస్టు, తండ్రి గొలుగొండ మండలం కొత్తమల్లంపేట పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. ‘వరంగల్‌ ఎన్‌ఐటీలో బీటెక్‌ (ఎలక్ట్రానిక్స్‌) చదివి హైదరాబాద్‌, బెంగళూరులలో రెండేళ్లపాటు ఉద్యోగం చేశా. సివిల్స్‌ లక్ష్యంగా ఉద్యోగం వదిలేసి 2020 నుంచి హైదరాబాద్‌, దిల్లీలలో కోచింగ్‌ తీసుకున్నా. అయిదో ప్రయత్నంలో విజయం సాధించా. విద్య, వైద్య రంగాల్లో పని చేయాలన్న కోరిక ఉంది’ అని భరద్వాజ తెలిపారు.

మలి ప్రయత్నంలోనే విజయం

పేరు: శ్రీపూజ
ర్యాంకు: 62

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ప్రాతూరుకు చెందిన తిరుమాని శ్రీపూజ సివిల్స్‌లో 62వ ర్యాంకుతో సత్తాచాటారు. తండ్రి వెంకటేశ్వర్లు తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కార్యాలయంలో ఈవోఆర్డీ. తల్లి గృహిణి. వారి స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం. ఉద్యోగరీత్యా తాడేపల్లికి వచ్చారు. శ్రీపూజ కర్నాటకలోని ఎన్‌ఐటీలో బీటెక్‌ చదివారు. ఇంజినీరింగ్‌ తర్వాత సిటీ బ్యాంక్‌లో ఉద్యోగం వచ్చింది. అది వద్దనుకొని సివిల్స్‌పై దృష్టి పెట్టి మలి ప్రయత్నంలో విజయం సాధించారు. ‘సివిల్స్‌ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత రోజూ 8 గంటలు చదివా. పరీక్షల ముందు 19 గంటలు చదవడం ద్వారా లక్ష్యాన్ని చేరుకున్నా. తొలిసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లా. రెండోసారి మరింత పట్టుదలతో కష్టపడి మంచి ర్యాంకు తెచ్చుకున్నా. నాన్న కూడా సివిల్స్‌కు ప్రయత్నించారు. ఆయన ఆశయాన్ని సాధించినందుకు గర్వంగా ఉంది. మహిళా విద్య, సాధికారతకు కృషి చేయాలని ఉంది’ అని ఆమె తెలిపారు.

ఐఐటీ విద్యార్థి... అసమాన విజయం

పేరు: గడ్డం సుధీర్‌కుమార్‌రెడ్డి
ర్యాంకు: 69

నంద్యాల జిల్లా కోవెలకుంట్ల యువకుడు గడ్డం సుధీర్‌కుమార్‌రెడ్డి 69వ ర్యాంకు సాధించారు. తండ్రి గడ్డం పెద్దరామసుబ్బారెడ్డి మాజీ సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌, తల్లి రమాదేవి గృహిణి. పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్‌పుర్‌లో ఐఐటీలో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ చదివారు. అనంతరం 2017 నుంచి 2018 వరకు దిల్లీలో సివిల్స్‌ కోచింగ్‌ తీసుకున్నారు. మొదటిసారిగా 2018లో సివిల్స్‌కు ప్రయత్నించగా విఫలమయ్యారు. రెండోసారి 2019లో ప్రిలిమ్స్‌, మెయిన్‌ వరకు వెళ్లి వెనుదిరిగారు. మూడోసారి 2020లో ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. నాలుగో ప్రయత్నంలో ప్రతిభ చూపి 69వ ర్యాంకు సాధించారు.

ఇంటి పట్టునే చదివి.. ఇంతింతై ఎదిగి..!

పేరు: నారాయణ్‌ అమిత్‌,
ర్యాంకు: 70

ఇంటి పట్టునే స్వీయ సన్నద్ధతతోపాటు యూట్యూబ్‌ క్లాస్‌లు, యూపీఎస్సీకి శిక్షణ ఇచ్చే వెబ్‌సైట్ల ద్వారా విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుని సివిల్స్‌లో 70వ ర్యాంకు సాధించారు చిత్తూరు జిల్లా విజయపురం యువకుడు నారాయణ్‌ అమిత్‌ మాలెంపాటి. ‘ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నాం. నాన్న జగదీష్‌బాబు సీనియర్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి. అమ్మ సుధారాణి గృహిణి. సోదరుడు అనురాగ్‌ వ్యాపారం చేస్తున్నారు. ఐఆర్‌ఎస్‌ అధికారిగా పనిచేస్తున్న నాన్నను చూసి... చిన్నప్పటి నుంచి ఐఏఎస్‌ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నా. 2016లో ఐఐటీ కాన్పూర్‌లో ప్రవేశం సాధించా. చివరి సంవత్సరంలో ఒక సెమిస్టర్‌కు ముందుగానే 2020లో యూపీఎస్సీ పరీక్ష రాశా. అప్పట్లో 289వ ర్యాంకు వచ్చింది. ఐఏఎస్‌ కావాలనే ఉద్దేశంతో సర్వీస్‌లో చేరలేదు. ఎక్కడా కోచింగ్‌ తీసుకోలేదు. ముందు సిలబస్‌పై పూర్తిగా దృష్టి పెట్టా. సందేహాలు వస్తే యూట్యూబ్‌, వెబ్‌సైట్ల సాయంతో నివృత్తి చేసుకున్నా. రోజూ ఎనిమిది గంటలు చదివా. మొదటి ప్రయత్నంలో ఆంత్రోపాలజీలో తక్కువ మార్కులు వచ్చాయి. రెండోసారి సన్నద్ధమయ్యేటప్పుడు ఈ సబ్జెక్ట్‌పై ప్రధానంగా దృష్టి పెట్టా. ఈసారి ఆంత్రోపాలజీలో 49 మార్కులు ఎక్కువ వచ్చాయి. మొత్తం 306 మార్కులు సాధించా. ఫలితంగానే 70వ ర్యాంకు వచ్చింది’ అని నారాయణ్‌ అమిత్‌ మాలెంపాటి వివరించారు.

తండా నుంచి తొలిప్రయత్నంలోనే..

గిత్యాల జిల్లా బీర్పూర్‌ మండలం చర్లపల్లికి చెందిన గిరిజన బిడ్డ గుగ్లావత్‌ శరత్‌నాయక్‌ సివిల్స్‌ ఫలితాల్లో 374వ ర్యాంకు సాధించి సత్తాను చాటాడు. తొలిప్రయత్నంలోనే ప్రతిభను చూపించాడు. ఉండడానికి సరిగ్గా ఇళ్లు కూడా లేని ప్రాంతం నుంచి పట్టుదలతో చదివి మంచి ర్యాంకుని అందుకున్నాడు. ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే చదివి తన ఆకాంక్షను నెరవేర్చుకున్నాడు. తండ్రి భాష్యానాయక్‌ రైతుగా వ్యవసాయాన్ని చేస్తుండగా తల్లి యమున మినీ అంగన్‌వాడీ కార్యకర్తగా పని చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి చదువుల్లో రాణిస్తున్న శరత్‌నాయక్‌ వైద్యుడిగా సేవలందించాలనే కలను కని అనూహ్యంగా సివిల్స్‌ వైపునకు మనసును మల్లించాడు. ఎంసెట్‌లో అనుకున్న ర్యాంకు రాకపోవడంతో వెటర్నరీ కోర్సులో చేరిన శరత్‌ గడిచిన రెండేళ్లుగా సివిల్స్‌ సాధన కోసం గదికే పరిమితమై మొదటి ప్రయత్నంలోనే మంచి ప్రతిభను చూపించాడు. మరోవైపు కరీంనగర్‌కు చెందిన కానిస్టేబుల్‌ రాంగోపాల్‌ కుమారుడు శ్రీధర్‌ సివిల్స్‌లో 336 ర్యాంకు సాధించాడు.

తొలుత ఐఆర్‌ఎస్‌... ఇప్పుడు ఐఏఎస్‌

సంజనా సింహాది హైదరాబాద్‌లోని వనస్థలిపురం. తండ్రి ఉదయసింహా న్యాయవాది, తల్లి అరుణశ్రీ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో సీనియర్‌ మేనేజర్‌. ఆమె 2017లో నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో బీటెక్‌ గోల్డ్‌మెడల్‌ సాధించారు. అనంతరం డెలాయిట్‌లో ఏడాదిపాటు పనిచేశారు. 2018లో ఉద్యోగం మానేసి హైదరాబాద్‌లో సివిల్స్‌ శిక్షణ పొందారు. అక్కడ మెంటార్‌గా పనిచేస్తున్న కందుకూరుకు చెందిన హర్ష మన్నవతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. సంజన 2018లో మొదటిసారి సివిల్స్‌ రాయగా ఉత్తీర్ణత సాధించలేదు. 2019లో ముఖాముఖి వరకు వెళ్లారు. 2020లో 207వ ర్యాంకుతో ఐఆర్‌ఎస్‌కు ఎంపికై, ప్రస్తుతం ఇన్‌కమ్‌ టాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా పని చేస్తున్నారు. 2021లో 37వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు.

ఇవీ చూడండి..

Civils Results 2021: 'సివిల్స్ ర్యాంకర్స్‌ విజయ సూత్రాలివే'

సివిల్స్​లో అమ్మాయిల సత్తా.. టాప్​ 3 ర్యాంకులు వారికే

ABOUT THE AUTHOR

...view details