చదువుకోవడానికి, నేర్చుకోవడానికి వయస్సుతో సంబంధం లేదని నిరూపించారు ఓ వృద్ధుడు. 68 సంవత్సరాల వయస్సులో న్యాయశాస్త్రం చదివి అందరికీ ఆదర్శంగా నిలిచారు. తన సొంత వ్యాపార కేసులను వాదించుకోవడానికి లా కోర్సు చేశారు పంజాబ్లోని ఓ విశ్రాంత ప్రభుత్వోద్యోగి.
తన కేసు తానే వాదించడం కోసం.. 68 ఏళ్ల వయస్సులో న్యాయ పట్టా! - ప్రశోత్తం బన్సల్ లేటెస్ట్ న్యూస్
చదవాలనే కృషి, పట్టుదల ఉంటే వయస్సు ఏమాత్రం అడ్డం కాదని మరోసారి రుజువు చేశారు ఓ 68 ఏళ్ల వ్యక్తి. తన కేసును తానే వాదించుకోవడం కోసం రిటైరైన తరవాత కూడా.. పట్టుదలతో న్యాయశాస్త్రం పూర్తి చేసి అందర్నీ ఔరా అనిపించారు.
![తన కేసు తానే వాదించడం కోసం.. 68 ఏళ్ల వయస్సులో న్యాయ పట్టా! First government job then studied law at the age of 68 to fight his own cases in courts](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16747067-thumbnail-3x2-law.jpg)
పంజాబ్లోని బఠిండాకు చెందిన ప్రశోత్తం బన్సల్ ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. ఎన్ఎఫ్ఎల్లో పనిచేస్తూ 2016 లో పదవీవిరమణ పొందారు. అనంతరం 2019లో పంజాబ్లోని బఠిండా విశ్వవిద్యాలయం నుంచి రెగ్యులర్గా 'లా' కోర్సు పూర్తిచేశారు. బన్సల్కు సొంతంగా కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. వాటిపై న్యాయపరమైన సమస్యలు ఉన్న కారణంగా కోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. మొదట్లో న్యాయపరంగా సరైన అవగాహన లేక కేసుల విచారణ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురుకోవాల్సి వచ్చిందని చెప్పారు బన్సల్. అందుకే తాను న్యాయవిద్య చదివినట్లు తెలిపారు.
'ప్రతీ ఒక్కరూ భారతీయ చట్టాల గురించి తెలుసుకోవాలి. అప్పుడే వారి హక్కులను, అధికారాలను తెలుసుకోగలుగుతారు. న్యాయం పొందడం, హక్కులను తెలుసుకోవడం ప్రతీ ఒక్కరి హక్కు' అని ఆయన అన్నారు. తాను లా కోర్సులో చేరినప్పుడు విద్యార్థులు సహకరించలేదని, క్రమంగా తనతో వారు కలసిపోయారని చెప్పారు బన్సల్. గతంలో అమ్మాయిలు న్యాయవాద రంగంవైపు వచ్చేవారు కాదని.. ఇప్పుడు పెద్ద సంఖ్యలో అమ్మాయిలు న్యాయవృత్తిని చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. అందుకు తాను సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.