తెలంగాణ

telangana

ETV Bharat / bharat

65 ఏళ్ల ఐటీఐ 'విద్యార్థి'.. చదువుల్లో మేటి!

అనుకున్నది సాధించేందుకు వయస్సుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు హరియాణాకు చెందిన ఓ రైతు. 65ఏళ్ల విజయ్​ గులియా.. పుస్తకం చేతపట్టి కర్నల్​లోని ఐటీఐలో 'సాయిల్​ టెస్టింగ్​ అండ్​ క్రాప్​ టెక్నాలజీ'పై కోర్సు చేస్తున్నారు. ఇందుకోసం రోజుకు 64 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. విజయ్​ గులియా అంకితభావానికి అక్కడి టీచర్లు, విద్యార్థులు మంత్రముగ్ధులవుతున్నారు.

65 year old farmer in Karnal proves that it's never too late to learn
65ఏళ్ల వయస్సులో.. పుస్తకం చేతపట్టి

By

Published : Oct 10, 2021, 8:48 PM IST

65 ఏళ్ల ఐటీఐ 'విద్యార్థి'.. చదువుల్లో మేటి!

ఆయనది రిటైర్మెంట్​ తీసుకుని హాయిగా గడపాల్సిన వయస్సు. మనవళ్లు, మనవరాళ్లతో జీవితానుభవాలు పంచుకోవాల్సిన సమయం ఇది. అలాంటిది.. ఆయన పుస్తకం చేతపట్టుకుని పాఠాలు నేర్చుకుంటున్నారు. 65ఏళ్ల వయస్సులో.. ఈ తరం విద్యార్థులకు చదువులో సవాళ్లు విసురుతున్నారు. అనుకున్నది సాధించేందుకు వయస్సుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు. ఆయనే హరియాణాకు చెందిన విజయ్​ గులియా.

విజయ్​ గులియా
కర్నల్​ ఐటీఐ

సోనిపట్​లోని గన్నౌర్​ వాసి విజయ్​ గులియా. ఆయన భార్య ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్​. ఆయనకు ఇద్దరు పిల్లలు. గులియాకు ఐదెకరాల పొలం ఉంది. దానిని సాగుచేస్తూ ఉంటారు. పొలం సాగుకు సంబంధించి కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆయన ఎప్పుడూ తపనపడుతూ ఉంటారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి నాలుగు కోర్సులు పూర్తిచేశారు. తాజాగా.. కర్నల్​లోని బాబు మూల్​చంద్​ జైన్​ ప్రభుత్వ ఐటీఐ సంస్థలో చేరారు. అక్కడ 'సాయిల్​ టెస్టింగ్​ అండ్​ క్రాప్​ టెక్నాలజీ'పై కోర్సు చేస్తున్నారు.

విద్యార్థులతో విజయ్​ గులియా

"ట్రాక్టర్​తో పొలం పనులు చేస్తాను. ఇప్పుడు అన్నిపనులు ట్రాక్టర్​తోనే జరిగిపోతున్నాయి. ఇది యంత్రాలతో పనిపూర్తయ్యే కాలం. బీఏ చేశాను. అప్పటి నుంచి పొలం పనులు చూసుకునేవాడిని. ఇప్పుడు ఐటీఐలో చేరాను. నాకు వయసు మీదపడుతోంది. వాస్తవానికి ఎల్​ఎల్​బీ కూడా చేద్దాము అనుకున్నా. కానీ కుదరలేదు."

--- విజయ్​ గులియా, హరియాణా

65 ఏళ్ల వయస్సులోనూ నచ్చిన పని చేసేందుకు గులియా ఎంత కష్టాన్ని అయినా భరిస్తున్నారు. చదువు కోసం ఇంటి నుంచి బస్సులో కర్నల్​కు రోజుకు 64 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. గులియా అంకితభావానికి అక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థులు మంత్రముగ్ధులవుతున్నారు. నిమిషం ఆలస్యం చేయరని, హోంవర్క్​ కూడా శ్రద్ధగా పూర్తిచేస్తారని టీచర్లు అంటున్నారు. గులియా నుంచి నేటి తరం విద్యార్థులు నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెబుతున్నారు.

యూనిఫాంలో విజయ్​ గులియా
ట్రాక్టర్​ నడుపుతూ..

వాస్తవానికి.. వయసు మీదపడిన కారణంగా.. గులియా వినికిడి శక్తి క్షీణిస్తోంది. చాలా వరకు ఆయన వినలేరు. ఇందుకోసం టీచర్లు ప్రత్యేక దృష్టి సారించారు. ఆయనకు అర్థమయ్యే విధంగా కాగితాల్లో రాసి ఇస్తున్నారు.

"గత 15ఏళ్లుగా నేను అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. ఎందరో విద్యార్థులు ఇక్కడ శిక్షణ తీసుకుని, ఉన్నత శిఖరాలకు చేరారు. ఈసారీ ఓ విద్యార్థి చేరారు. ఆయన్ను పిల్లాడు అనలేము. అందుకు ఆయన వయస్సు సరిపోదు. కానీ కొత్త విషయాలు నేర్చుకోవాలన్న తపనలో ఆయన యువకులతో పోటీపడుతున్నారు. ఆయనే విజయ్​ గులియా. అడ్మిషన్​ కోసం ఆయన మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఆశ్చర్యపోయాము. కానీ పనిచేసే తీరు, టీచర్లకు ఇచ్చే మర్యాద, సంస్థకు ఇచ్చే గౌరవం విషయంలో ఆయన ఎవరికీ తక్కువ కాదు. వయసుతో పాటు అనుభవం పెరుగుతుంది. అనుభవాలను ఆయన బాగా ఉపయోగించుకుంటారు. మేము నేర్పించేది అంతా ఆయన నేర్చుకుంటారు. మేము నేర్పించనివి కూడా ఆయన నేర్చేసుకుంటున్నారు. ఎంతో శ్రద్ధగా హోంవర్క్​ చేస్తారు. ఆయన ప్రాక్టికల్స్​ రిపోర్టు చూస్తే చాలా చక్కగా ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యమైనది.. విజయ్​ సమయానికి విలువనిస్తారు. సరైన సమయానికి వస్తారు. యూనిఫాం వేసుకుని, నిబంధనలు పాటిస్తారు. 15ఏళ్లుగా నేను టీచర్​ వృత్తిలో ఉన్నాను. ప్రజాసేవ, రోడ్డు నిర్మాణాల్లో పనిచేసేవారికి పార్ట్​టైమ్​ శిక్షణ ఇచ్చాను. కానీ ఈ వయస్సులో ఉన్న వారికి ఎప్పుడూ శిక్షణ ఇవ్వలేదు. ఈ అనుభవంతో నేనూ చాలా నేర్చుకున్నాను."

--- రామ్​ విలాస్​, టీచర్​.

క్లాసు ముగిసిన తర్వాత.. అక్కడి విద్యార్థులకు గులియా ట్రాక్టర్​ పనులు నేర్పిస్తుంటారు. మట్టి, భూమితో మనిషికి ఉన్న బంధాన్ని వివరిస్తుంటారు. ఆయన అనుభవాలను అక్కడి విద్యార్థులు కూడా ఎంతో శ్రద్ధగా వింటున్నారు.

ఇదీ చూడండి:-నాన్నతో కలిసి విమానం ఎక్కి- మోదీకి థాంక్స్​ చెప్పి

ABOUT THE AUTHOR

...view details