తెలంగాణ

telangana

తప్పుడు ఆఫర్​తో మోసం.. రూ.60 కోసం పదేళ్లు పోరాడిన వ్యక్తి.. కోర్టు ఏమందంటే?

By

Published : Apr 1, 2023, 10:30 PM IST

60 రూపాయల కోసం పదేళ్లు పోరాడాడు ఓ వ్యక్తి. న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గలేదు. తప్పుడు ఆఫర్లతో తనను మోసం చేసిన వారిని న్యాయస్థానంలో నిలబెట్టి.. అనుకున్నది సాధించాడు. అసలేమైందంటే?

MAN FOUGHT 10 YEARS FOR RS 60
MAN FOUGHT 10 YEARS FOR RS 60

వినియోగదారుల హక్కుల గురించి చాలా తక్కువ మందికే అవగాహన ఉంటుంది. ఎన్నో సార్లు చిన్న చిన్న మొత్తాలు పోగొట్టుకున్నా.. వాటి గురించి ఎవరూ అడిగేందుకు ప్రయత్నించరు. సేవల్లో లోపాలు ఉన్నా.. సర్దుకుపోతారే తప్ప ఫిర్యాదులు, కేసులు మనకెందుకు అని అనుకుంటారు. కానీ దిల్లీకి చెందిన ఓ వ్యక్తి అలా అనుకోలేదు. 60 రూపాయల కోసం పదేళ్ల పాటు న్యాయస్థానంలో పోరాడాడు. ప్రయత్నాలు ఫలించి అతడికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఫిర్యాదుదారుడికి పరిహారం ఇవ్వాలని సంబంధిత వ్యక్తులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ జరిగింది...
ఫిర్యాదుదారుడు కమల్ ఆనంద్ దక్షిణ దిల్లీలో నివాసం ఉండేవాడు. 2013లో సాకేత్ డిస్ట్రిక్ట్ సెంటర్​లో ఉన్న ఓ మాల్​లోని కోస్టా కాఫీ ఔట్​లెట్​లో కాఫీ తాగేందుకు తన భార్యతో కలిసి వెళ్లాడు. కాఫీ తాగితే పార్కింగ్ ఉచితం అని చెబుతూ అక్కడి ఉద్యోగి వారికి ఆఫర్ స్లిప్ ఇచ్చారు. దీంతో రెండు కాఫీలు ఆర్డర్ ఇచ్చిన కమల్ ఆనంద్.. రూ.570 బిల్లు చెల్లించాడు. అయితే, తన కారును పార్కింగ్ నుంచి బయటకు తీసేందుకు వెళ్లగా.. అక్కడి నిర్వాహకుడు ఫీజు అడిగాడు. రూ.60 పార్కింగ్ ఫీజు చెల్లించాలని కోరాడు. వెంటనే కాఫీ షాప్​లో తనకు వచ్చిన ఫ్రీ పార్కింగ్ ఆఫర్ టికెట్​ను.. నిర్వాహకుడికి చూపించాడు కమల్ ఆనంద్.

అయితే, పార్కింగ్ సిబ్బంది తమకు ఆ ఆఫర్ గురించి తెలియదని కమల్​కు చెప్పారు. పార్కింగ్ ఫీజు 60 రూపాయలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. దీనిపై వెంటనే కోస్టా కాఫీ ఔట్​లెట్​కు వెళ్లి ఫిర్యాదు కూడా చేశాడు కమల్. మాల్ యజమానికి సైతం ఈ విషయం గురించి చెప్పాడు. అయినప్పటికీ పార్కింగ్ కాంట్రాక్టర్.. ఫీజు విషయంలో వెనక్కి తగ్గలేదు. 60 రూపాయలు కట్టాల్సిందేనని తెగేసి చెప్పాడు. దీంతో పార్కింగ్ ఫీజు చెల్లించి బయటకు వచ్చేశాడు కమల్. అనంతరం, దక్షిణ దిల్లీలోని వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్​లో ఇందుకు సంబంధించి కేసు దాఖలు చేశాడు. తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను కమిషన్ ఛైర్మన్ రాజ్ కుమార్ చౌహాన్, సభ్యులు రాజేంద్ర ధార్, రీతు గరోడియాకు సమర్పించాడు.

అయితే, ఇందుకు సంబంధించిన విచారణ పదేళ్ల పాటు సాగింది. విచారణ సమయంలో న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును 60 రూపాయల కోణంలో చూడకూడదని పేర్కొంది. ఇది వినియోగదారుల హక్కులకు సంబంధించినదని వ్యాఖ్యానించింది. 'తప్పొప్పులకు సంబంధించిన కేసు ఇది. కస్టమర్లకు ముందుగా ఆఫర్ల గురించి చెప్పి.. వారికి ఆ సేవలు అందించకుండా తిరస్కరించడం నిర్లక్ష్యం కిందకే వస్తుంది' అని కోర్టు స్పష్టం చేసింది. నిందితులపై రూ.61,201 జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని కమల్​కు చెల్లించాలని ఆదేశించింది. ఫిర్యాదుదారుడు పదేళ్ల పాటు పోరాడటంపై న్యాయస్థానం అభినందించింది.

ABOUT THE AUTHOR

...view details