Bihar bridge robbery: మీరు ఇప్పటివరకు ఎన్నో దొంగతనాల గురించి విని ఉంటారు. కానీ ఈ దోపిడీ గురించి తెలిస్తే మాత్రం ఇలాంటి దొంగలు కూడా ఉంటారా అని అవాక్కవ్వడం ఖాయం. ఇంట్లోకి చొరబడి రూ.లక్షల నగదు, బంగారం, ఆభరణాలు దోచుకెళ్లిన గజదొంగలు, ఏదీ దొరకనప్పుడు వస్తువులను తీసుకెళ్లే చిన్న చిన్న దొంగతనాలను మనం చాలాసార్లు చూశాం. కానీ ఈ ముదుర్లు మాత్రం ఏకంగా 60 అడుగుల బ్రిడ్జినే లేపేశారు. మూడు రోజుల్లోనే పనికానిచ్చారు. కానీ ఇంత జరగుతున్నా ఈ విషయాన్ని చుట్టు పక్కలవారు ఎవరూ పసిగట్టలేకపోయారు. చివరకు అసలు విషయం తెలిసి కంగుతిన్నారు.
బిహార్ రోహ్తాస్ జిల్లా నాసరీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమియావార్లో ఓ పురాతన ఐరన్ బ్రిడ్జి ఉంది. దీని పొడవు 60 అడుగులు, వెడల్పు 10 అడుగులు. ఎత్తు 12 అడుగులు. 20 టన్నుల బరువుంటుంది. వాడుకలో లేని ఈ వంతెనలో భారీగా ఇనుము ఉండటం చూసి దొంగలు పక్కా పథకం పన్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులమని చెప్పి గ్యాస్ కట్టర్లు, జేసీబీని ఉపయోగించి ఇనుమునంతా కట్ చేశారు. ఎంచక్కా దాన్ని డీసీఎంలో లోడ్ చేసి దర్జాగా తీసుకెళ్లారు. గ్రామస్థులు వచ్చి అడిగినా ఏమాత్రం తడబడకుండా 'ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం దీన్ని తొలగిస్తున్నాం" అని సమాధానం చెప్పారు. దీంతో వారు కూడా పట్టించుకోలేదు. అయితే మూడు రోజుల్లోనే బ్రిడ్జిని మాయం చేసిన తర్వాత వచ్చింది ఇరిగేషన్ అధికారులు కాదు, దొంగలు అని తెలిసింది. దీంతో స్థానికులు సహా ప్రభుత్వ అధికారులు కూడా అవాక్కయ్యారు.