ఆ చిన్నారికి ఇంకా ఆరేళ్లయినా నిండలేదు. అయితేనేం తన అభిరుచి, తపనకు తగ్గట్టుగా ప్రతిభకు పదును పెట్టింది. రాష్ట్రాలు, ప్రముఖులు, అలనాటి సినిమాల పేర్లను అలవోకగా చెప్పేస్తూ అవార్డులు కొట్టేస్తోంది. అంతేకాదు ప్రముఖుల ప్రశంసలూ అందుకుంటోంది. నైపుణ్యం సంపాదించేందుకు వయసు అడ్డురాదని రుజువుచేస్తోందా చిన్నారి.
కాదేదీ ప్రతిభకు అనర్హం..
కర్ణాటక ధార్వాడ్ జిల్లా కుందగోల పట్టణానికి చెందిన శ్రీషా ముదగన్నవర్ అనే చిన్నారి జనరల్ నాలెడ్జ్‌లో అద్భుత ప్రతిభ కనబరుస్తోంది. దీనిని గుర్తించిన యూనివర్సల్ తమిళ్ యూనివర్సిటీ ఆమెకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. పట్టణానికి చెందిన ఈశ్వర్-కీర్తిల కుమార్తె అయిన శ్రీషా రెండో తరగతి చదువుతోంది. పలు అంశాల్లో ప్రతిభను ప్రదర్శిస్తున్న ఈ చిన్నారి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్(India Book of Records), ఎక్స్‌క్లూజివ్ వరల్డ్ రికార్డ్(Exclusive World Record), కర్ణాటక అచీవర్స్ ఆఫ్ బుక్ రికార్డ్స్(Karnataka Achievers Book of Records), ఫ్యూచర్ కలాం బుక్ ఆఫ్ రికార్డ్స్(Future Kalams Book of Records), ది యూనివర్స్ అచీవర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్(The Universe Achievers Book of Records) వంటి రికార్డులను కూడా దక్కించుకుంది.
అదెంతో ఈజీ..
రామాయణ, మహాభారత గ్రంథాల రచయితలు, దేశ స్వాత్యంత్రానికి పూర్వం పాలించిన బ్రిటీషు గవర్నర్ల పేర్లు చిన్నారికి కొట్టినపిండి. జవహర్లాల్ నెహ్రూ ప్రస్థానం, ఎవరెస్ట్ ఎక్కిన మొదటి భారతీయ మహిళ వంటి అనేక అంశాలపై సంధించే ప్రశ్నలకు నవ్వుతూ సమాధానమిస్తోందీ చిన్నారి. ఇక మొదటి వ్యాకరణ గ్రంథకర్త, కర్ణాటక తొలి ముఖ్యమంత్రి, కర్ణాటక కేసరి, కర్ణాటక గాంధీ సహా.. రాష్ట్రంలో అచ్చయిన తొలి పత్రిక వంటి పేర్లను అలవోకగా చెప్పేస్తోంది.