కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో విషాద ఘటన జరిగింది. స్కూల్ బస్ వచ్చిందనే హడావుడిలో చాక్లెట్ మింగేసిన ఓ చిన్నారి.. బస్ డోర్ వద్దే కుప్పకూలింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. అప్పటికే చిన్నారి మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ జరిగింది..జిల్లాలోని బైందూర్ సమీపంలో ఉన్న బిజూర్ గ్రామానికి చెందిన సమన్వి(6) అనే బాలిక.. స్థానిక వివేకానంద స్కూల్లో మొదటి తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం.. చిన్నారి స్కూల్కు వెళ్లడానికి మారాం చేసింది. అయితే తల్లిదండ్రులు.. బాలికను నచ్చజెప్పి చాక్లెట్ ఇచ్చారు. అనంతరం చాక్లెట్ను బాలిక తింటున్న సమయంలో స్కూల్ బస్ వచ్చేసింది. దీంతో ఆ హడావుడిలో సమన్వి.. ఒక్కసారిగా చాక్లెట్ను మింగేసింది. ఆ తర్వాత స్కూల్ బస్ డోర్ వద్ద కుప్పకూలింది.