దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. దిల్లీ సహా పలు నగరాల్లో కొరత ఎక్కువగా ఉంది. పంజాబ్ అమృత్‌సర్‌లోని నీల్కాంత్ ప్రైవేటు ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా నిలిచి ఆరుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఐదుగురు కరోనా రోగులు ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆరుగురు చనిపోయిన తర్వాత.. ఐదు ఆక్సిజన్ సిలిండర్లను ఆసుపత్రికి పంపింనట్లు తెలిపాయి.
ఈ ఘటన నేపథ్యంలో అధికారులతో సమావేశమయ్యారు రాష్ట్ర మంత్రి ఓం ప్రకాశ్ సోనీ. ముగ్గురు సభ్యులతో కమిటీ వేసినట్లు తెలిపారు. కారకులపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ప్రజలను కోరారు.
వాల్వ్ ఆఫ్ చేయటంతో ఇద్దరు మృతి
మహారాష్ట్ర బీద్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అమానవీయ ఘటన జరిగింది. రోగులకు అమర్చిన ఆక్సిజన్ సిలిండర్ల వాల్వ్‌ను గుర్తు తెలియని వ్యక్తి ఆఫ్ చేయటం వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలోని వార్డు 7లో ఈ ఘటన జరిగినట్లు మృతుల బంధువులు తెలిపారు. అయితే.. ఆసుపత్రిలో ఒక్కరే ఆక్సిజిన్పై చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలపగా.. బందువులు మాత్రం ఇద్దరూ ఆక్సిజన్‌పై ఉన్నట్లు పేర్కొన్నారు. 'ఆక్సిజన్ సరఫరా చేసే వాల్వ్ ఆఫ్ చేసినట్లు ఆసుపత్రి సిబ్బంది గుర్తించారు. ఎవరైనా దానిని ఆఫ్ చేసి ఉండొచ్చు. 'అని వైద్యుడు సుఖ్‌దేవ్ రాథోడ్ తెలిపారు.
రెండు ఆసుపత్రుల్లో పడకల తగ్గింపు..
ఆక్సిజన్ కొరత కారణంగా దిల్లీలోని రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, గురు టెగ్ బహదుర్ ఆసుపత్రుల్లో కరోనా పడకలను తగ్గించాయి. రాజీవ్‌గాంధీ ఆసుపత్రిలో 650 పడకలు ఉండగా.. ప్రస్తుతం వాటిని 350కి తగ్గించారు. అలాగే.. బహదూర్ ఆసుపత్రిలో 1500 పడకలు ఉండగా ఇప్పుడు 700 మాత్రమే ఉన్నాయి. అవీ పూర్తిగా నిండిపోయాయి. ఆక్సిజన్ కొరత కారణంగానే పడకలను తగ్గించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి:ఆక్సిజన్ కొరతతో 25 మంది రోగులు మృతి