హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో.. శనివారం మరో ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 23కు చేరింది. ఈ మేరకు ఓ సీనియర్ అధికారి తెలిపారు.
ఐదో నంబర్ జాతీయ రహదారిపై నిచార్ తాలుకా చౌరా గ్రామంలోని శిథిలాల వద్ద ఆరుగురి మృతదేహాలు కనిపించాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారి సుదేశ్ కుమార్ మోఖ్తా తెలిపారు. గల్లంతైన మరో 9 మంది కోసం తనిఖీలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఐటీబీపీ సిబ్బంది, స్థానిక పోలీసులు, హోంగార్డులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు.
కిన్నౌర్ నుంచి సిమ్లాకు వెళ్తున్న హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన ఓ ప్రయాణికుల బస్సు, ఓ ట్రక్కు, కొన్ని కార్లపై బుధవారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన జరిగిన రోజున శిథిలాల కింద నుంచి 10 మృతదేహాలను వెలికితీయగా మరో 13 మందిని రక్షించారు. గురువారం మరో నాలుగు మృతదేహాలను లభ్యమయ్యాయి. శనివారం మరో ఆరు మృతదేహాలు లభ్యం కాగా.. మరో 9 మంది గల్లంతయ్యారని అధికారులు భావిస్తున్నారు.