సాంకేతిక రంగంలో మరో మైలురాయిని చేరుకుంది భారత్. నాలుగో పారిశ్రామిక విప్లపంగా భావిస్తున్న 5జీ సేవలు దేశంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దేశంలోని ప్రధాన నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించారు. ఆరో విడత ఇండియా మెుబైల్ కాంగ్రెస్ కార్యక్రమం జరుగుతున్న దిల్లీలోని ప్రగతి మైదానంలో ఈ ప్రారంభోత్సవం జరిగింది. ప్రస్తుతం నిర్దేశిత నగరాల్లో మాత్రమే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. వచ్చే రెండేళ్లలో యావత్ దేశమంతా 5జీ సేవలను విస్తరించనున్నట్లు పేర్కొన్నాయి.
5జీ సేవలను ప్రారంభిస్తున్న మోదీ 5జీ సేవలు ప్రారంభించడానికి ముందు.. టెలికాం సంస్థల స్టాళ్లను మోదీ పరిశీలించారు. అక్కడి స్టాళ్లలో కలియతిరిగారు. జియో, ఎయిర్‌టెల్ సహా పలు సంస్థల 5జీ ఉత్పత్తులను వీక్షించారు. ఆయా కంపెనీల ప్రతినిధులు తమ ఉత్పత్తుల గురించి మోదీకి వివరించారు. ప్రత్యేక కళ్లద్దాలు ధరించి వీడియోలు వీక్షించారు. ఓ స్టాల్లో వీడియో గేమ్ సైతం ఆడారు.
ప్రగతి మైదాన్‌లో టెలికాం సంస్థల స్టాళ్లను ప్రారంభిస్తున్న మోదీ 5జీ సేవల గురించి వివరిస్తున్న జియో ప్రతినిధులు 2035 నాటికి భారత్‌ను 450 బిలియన్‌డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో 5జీ ముఖ్యపాత్ర పోషిస్తుందని ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి. 5జీతో కొత్త ఆర్థిక అవకాశాలు, సామాజిక ప్రయోజనాలను పెంపొందిస్తుందని తెలిపాయి. అలాగే నూతన ఆవిష్కరణలు, అంకుర సంస్థలు, డిజిటల్‌ఇండియా విజన్‌ను చేరుకోవడానికి దోహదం చేస్తుందని పేర్కొన్నాయి. చైనా తర్వాత స్మార్ట్‌ఫోన్లకు అతిపెద్ద మార్కెటుగా ఉన్న భారత్‌లో 5జీ రాక.. ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి.
ఎవరికి ఎంత స్పెక్ట్రమ్?
భారత్‌పై 5జీ మొత్తం ఆర్థిక ప్రభావం 2035 నాటికి సుమారు రూ.36 లక్షల కోట్లకు చేరొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత 4జీతో పోలిస్తే 7నుంచి 10 రెట్ల డేటా వేగం.. 5జీ సేవల్లో లభిస్తుందని, కొత్త ఆర్థిక అవకాశాలు, సామాజిక ప్రయోజనాలు సాధ్యపడతాయని చెబుతున్నారు. దేశంలోని 3 ప్రైవేటు టెలికాం సంస్థలు 5జీ సేవల కోసం రూ.1.5 లక్షల కోట్ల స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి. జియో రూ.88వేల 78 కోట్లు, ఎయిర్‌టెల్ రూ.43వేల 84 కోట్లు, వొడాఫోన్ ఐడియా 18వేల 799 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి.
ఆ దేశాల్లో ఇప్పటికే షురూ..
ఇప్పటికే అమెరికా, చైనా, దక్షిణ కొరియా, ఐరోపాలోని కొన్ని దేశాల్లో 5జీ అందుబాటులోకి వచ్చింది. అక్కడా ఈ సేవలు కొన్ని పట్టణాలకే పరిమితమయ్యాయి. భారత్‌లోనూ ప్రస్తుతం ఎంపిక చేసిన నగరాల్లోనే 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. వచ్చే రెండేళ్ల యావత్ దేశానికి దానిని విస్తరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటిదాకా టెలికం రంగంలోని 1జీ నుంచి 4జీ దాకా ప్రతిసారీ నెట్‌వర్క్ సదుపాయాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే. 5జీలో మాత్రందేశీయంగా ఉత్పత్తిచేసిన పరికరాలనే వాడుతున్నారు.
ఛార్జీలు తక్కువే..
అధికారికంగా ప్రకటించకున్నా.. 4జీ ఖర్చులతో పోలిస్తే 5జీ ఖర్చులు భారీగా ఉండకపోవచ్చని టెలికాం రంగ నిపుణులు భావిస్తున్నారు. కానీ డేటా వేగం పెరుగుతున్న కారణంగా వినియోగదారులు 5జీలో అధికంగా డేటాను వినియోగించే అవకాశాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఫలితంగా టెలికం కంపెనీలకు ప్రతి వినియోగదారుపై సగటు ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. ఫలితంగా ఛార్జీలు పెంచకున్నా, కంపెనీలకు ఆదాయం పెరుగుతుందని విశ్లేషిస్తున్నారు.