57 Year Old Won Power Lifting Gold Medal :పంజాబ్ లూధియానాకు చెందిన అవతార్ సింగ్ లాల్టన్ 57 ఏళ్ల వయసులో రికార్డులు తిరగరాస్తున్నారు. రష్యాలో నిర్వహించిన ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ లీగ్(ఐపీఎల్) టోర్నీలో గోల్డ్ మెడల్ సాధించారు. డెడ్లిఫ్టింగ్లో 240 కేజీలు ఎత్తి సంచలనం నమోదు చేశారు. ఈ విభాగంలో జాతీయ రికార్డు 200 కేజీలు కాగా.. దీన్ని బద్దలు కొట్టారు అవతార్. భారత్‌కు తిరిగివచ్చిన ఆయనకు ఘనస్వాగతం పలికి సత్కరించారు స్థానికులు.
భారత్‌లో 57 ఏళ్ల వయసులో పవర్ లిఫ్టింగ్ చేస్తున్న ఏకైక అథ్లెట్ అవతార్ సింగ్. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొని వరుసగా రెండు గోల్డ్ మెడల్స్ గెలిచిన ఘనతను సొంతం చేసుకున్నారాయన. సింగపూర్‌లో జరిగిన పోటీల్లోనూ ఆయన మెడల్ గెలుచుకున్నారు. తాను పూర్తిగా భారతీయ డైట్‌నే ఫాలో అవుతున్నట్లు అవతార్ సింగ్ చెబుతున్నారు. స్థానికంగా దొరికే ఆహార పదార్థాలతోనే పవర్ లిఫ్టింగ్‌కు సన్నద్ధమైనట్లు చెప్పారు. 'టోర్నీలో భాగంగా విదేశీయులతో పోటీ పడాల్సి ఉంటుంది. ఇండియన్ డైట్‌తోనే వారిని ఓడించాను' అని చెబుతున్నారు.
'ఆ రికార్డు బద్దలు కొడతా'
వచ్చే ఏడాది అమెరికాలో జరగనున్న ప్రపంచ ఒలింపియన్ ఛాంపియన్షిప్స్కు సిద్ధమవుతున్నారు అవతార్ సింగ్ లాల్టన్. ఆ టోర్నీలో ప్రపంచ రికార్డు 275 కేజీలు. ఈ రికార్డును బద్దలుకొట్టాలన్న లక్ష్యంతో ఆయన ఇప్పటి నుంచే ప్లాన్ వేసుకుంటున్నారు. 'శారీరకంగా నేను ఇప్పటికీ దృఢంగా ఉన్నా. నేను మరిన్ని మెడల్స్ తీసుకురాగలను. దేవుడి దయ ఉంటే 275 కిలోల ప్రపంచ రికార్డును సైతం బద్దలుకొడతా' అని ధీమాగా చెబుతున్నారు అవతార్.