Mundra port: గుజరాత్‌లో భారీ మొత్తంలో కొకైన్ పట్టుబడింది. 'ఆపరేషన్ నమ్కీన్'లో భాగంగా గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు రూ.500 కోట్లు విలువ చేసే కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇరాన్ నుంచి ఉప్పు పేరుతో సరకు వచ్చిందనే సమాచారంతో డీఆర్‌ఐ అధికారులు ముంద్రా పోర్టులో సోదాలు నిర్వహించారు. అనుమానంతో జరిపిన సోదాల్లో డీఆర్‌ఐ అధికారులు 57 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన డీఆర్‌ఐ అధికారులు.. కొకైన్ దిగుమతి విషయంలో పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
గతంలోనూ ఇదే పోర్టులో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయ్యింది. డీఆర్‌ఐ అధికారులు ముంద్రా పోర్టులో రూ. 9వేల కోట్ల విలువైన హెరాయిన్‌ను పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ ముఠాకు విజయవాడతో సంబంధాలు సైతం ఉండటం గమనార్హం. నిఘా వర్గాల సమాచారం మేరకు డీఆర్‌ఐ అధికారులు గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరుకున్న కంటైనర్లను స్వాధీనం చేసుకొని తనిఖీలు చేయగా భారీగా హెరాయిన్ బయటపడింది. ఆ కంటైనర్లు అఫ్గానిస్థాన్ నుంచి వచ్చాయని అధికారులు తెలిపారు. అయితే ఈ కంటైనర్లు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఓ ట్రేడింగ్ సంస్థకు చెందినవిగా డీఆర్‌ఐ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే.