56 Old Man Completed two Masters Degrees : మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌కు చెందిన రాజ్‌కరణ్ బారువా (56).. రూ.5 వేల జీతానికి రాత్రంతా సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. పగలు ఇళ్లలోనూ పనిచేస్తారీయన. ఇలా చాలామంది చేస్తూ ఉండవచ్చు. దాదాపు రిటైర్మెంట్ వయసుకు దగ్గరైనా చదువుపై ఇష్టం మాత్రం రాజ్‌కరణ్ బారువాకు తగ్గలేదు.
1996లోనే పురాతత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేసిన రాజ్‌కరణ్ గణితశాస్త్రంలో ఆ ఘనత సాధించాలన్నది తీరని కోరికగా ఉండేది. బతుకు పోరులో జీవితం ఎన్నో పరీక్షలు పెట్టినా మనసులోని ఆకాంక్షను అలాగే సజీవంగా ఉంచుకొన్నారు రాజ్‌కరణ్. 23 విఫల యత్నాల తర్వాత ఇటీవల డబుల్ పీజీ పూర్తి చేశారు. జబల్‌పుర్‌లోని రాణీ దుర్గావతి యూనివర్సిటీ నుంచి ఈ ఏడాది తన రెండో మాస్టర్ డిగ్రీ ఎమ్మెస్సీ ఇన్ మ్యాథ్స్‌ను ఆయన సాధించారు. అవివాహితుడిగా మిగిలిపోవడాన్ని గురించి స్పందిస్తూ.. 'నేను నా కలలను పెళ్లాడాను' అని చెప్పారు.
"ఈ ప్రయత్నంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. రాత్రిళ్లు యజమానులు కేక వేసినపుడు నేను మెట్లపై కూర్చొని చదువుకోవడాన్ని చూసి కొంతమంది కటువుగా మాట్లాడేవారు. నా రెండో ప్రయత్నంలో ఒక సబ్జెక్టు మినహా మిగతా అన్నింటిలో వరుసగా పరీక్షలు తప్పుతూ వచ్చాను. చివరకు సాధించాను. నా యజమానులు చదువు విషయంలో వారి పిల్లలపై కేకలు వేయడాన్ని చూశా. ఏ సదుపాయాలు లేని నేనే సాధించినపుడు.. వారెందుకు సాధించలేరు?".
-రాజ్‌కరణ్ బారువా, సెక్యూరిటీ గార్డ్