Indigo Flights Delayed: దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు శనివారం పెద్ద సంఖ్యలో ఆలస్యంగా రాకపోకలు సాగించాయి. ఏకంగా దేశీయంగా నడిచే 55 శాతం ఫ్లైట్స్ లేటయ్యాయి. గణనీయ సంఖ్యలో క్యాబిన్ సిబ్బంది సిక్ లీవ్ పెట్టి.. ఎయిర్ ఇండియా రిక్రూట్మెంట్ డ్రైవ్‌కు వెళ్లినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) చీఫ్ అరుణ్ కుమార్‌ను దీని గురించి అడగ్గా.. ఈ అంశంపై దృష్టి సారించినట్లు వివరించారు.
ఎయిర్ ఇండియా రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫేజ్-2 శనివారం జరిగింది. దీంతో చాలా మంది సిబ్బంది.. ఆ ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. 45.2 శాతం ఇండిగో ఫ్లైట్స్ మాత్రమే శనివారం సమయానికి నడిచినట్లు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో ఉంది. దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌లైన్స్ అయిన ఇండిగో దేశీయంగా, అంతర్జాతీయంగా కలుపుకొని రోజూ సుమారు 1600 విమానాలు నడుపుతుంటుంది.
ఇదే కారణమా? ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో జీతాల సమస్య ఉంది. కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో ఉద్యోగుల వేతనాల్లో 30 శాతం వరకు కోత విధించింది యాజమాన్యం. మళ్లీ ఈ ఏడాది ఏప్రిల్ 1న జీతాలను 8 శాతం వరకు పెంచింది. ఎలాంటి అవాంతరాలు లేనట్లయితే నవంబర్‌లో మరోసారి 6.5 శాతం మేర జీతాలు పెంచుతామని హామీ ఇచ్చింది. అయినా సంతృప్తి పడని కొన్ని వర్గాల పైలట్లు.. వేతనాల తగ్గింపునకు వ్యతిరేకంగా సమ్మెకు పిలుపునిచ్చారు. కొద్దిరోజులకే ఏప్రిల్ 4న వీరిని విధుల నుంచి బహిష్కరించింది ఇండిగో.