కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి స్థానంలో అతడి ఐదేళ్ల కుమారుడిని చైల్డ్ కానిస్టేబుల్‌గా నియమించారు ఛత్తీస్‌గఢ్ పోలీసులు. దీంతో కేవలం ఐదేళ్ల వయసులోనే ఆ బాలుడు పోలీస్ కానిస్టేబుల్‌గా మారాడు.
ఛత్తీస్‌గఢ్ సర్గుజా జిల్లాకు చెందిన నమాన్ రాజ్వాడే అనే 5 ఏళ్ల బాలుడు ప్రస్తుతం యూకేజీ చదువుతున్నాడు. అతడి తండ్రి రాజ్ కుమార్ రాజ్వాడే కొన్నేళ్లుగా జిల్లాలోని ఓ స్థానిక మహిళా పోలీస్ ఠాణాలో కానిస్టేబుల్‌గా పని చేసేవారు. విధులు నిర్వహిస్తున్న క్రమంలోనే కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు ఓ రోడ్ యాక్సిడెంట్లో మరిణించారు రాజ్‌కుమార్.
"నా భర్త కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆయన స్థానంలో నా కుమారుడిని చైల్డ్ కానిస్టేబుల్‌గా నియమించారు అధికారులు. కొంచెం బాధగా ఉంది. కానీ, నా బిడ్డ పోలీస్‌గా మారబోతున్నందుకు సంతోషంగానూ ఉంది."
- నీతూ రాజ్వాడే, చైల్డ్ కానిస్టేబుల్ తల్లి
పోలీస్ శాఖ నిబంధనల ప్రకారం కారుణ్య నియామకం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఛత్తీస్‌గఢ్ సర్గుజా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భావనా గుప్తా వెల్లడించారు.
"స్థానిక మహిళా ఠాణాలో కానిస్టేబుల్‌గా పనిచేసేవారు రాజ్‌కుమార్ రాజ్వాడే. కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో ఆయన స్థానంలో అతడి ఐదేళ్ల కుమారుడు నమాన్ రాజ్వాడేను చైల్డ్ కానిస్టేబుల్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నాం. పోలీసు హెడ్‌క్వార్టర్స్ మార్గదర్శకాల ప్రకారం ఇటువంటి సందర్భాల్లో మరణించిన వ్యక్తి కుటుంబంలో 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సుగల వారు ఉంటే వారికి ఈ ఉద్యోగవకాశాన్ని కల్పిస్తారు."
-భావనా గుప్తా, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్
ఇప్పుడే పోస్టింగ్ కానీ విధుల్లోకి మాత్రం..
చైల్డ్ కానిస్టేబుల్‌గా నియమితుడైన నమాన్ రాజ్వాడేకు ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు పోలీసులు. కానీ, నిబంధనల ప్రకారం ఆ బాలుడికి మైనారిటీ తీరిన తర్వాతే అంటే 18 ఏళ్లు నిండాకే పూర్తి స్థాయి విధుల్లోకి తీసుకోనున్నారు అధికారులు.
ఇలాంటి సంఘటనే మరొకటి కూడా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోనే జరిగింది. ఈ ఏడాది జనవరిలో ఐదేళ్ల చిన్నారిని చైల్డ్ కానిస్టేబుల్‌గా నియమించింది ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం. బాలుడి తండ్రి అకాలమరణం కారణంగా కారుణ్య నియామకం కింద ఆ చిన్నారికి ఈ ఉద్యోగం వచ్చింది. అతడికి 18 సంవత్సరాలు నిండిన తర్వాతే పూర్తి స్థాయి కానిస్టేబుల్‌గా విధుల్లో చేరనున్నాడు. ఈ కథనం పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.