అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి ఆస్పత్రే ఇల్లుగా మారిపోయింది. ఐదేళ్లుగా అక్కడే ఉంటోంది. వెంటిలేటర్‌పై ఉంటూ ప్రతి క్షణం చావుతో పోరాడుతోంది. ఝార్ఖండ్‌కు చెందిన సౌమిలి తివారి అనే చిన్నారి.. 2017లో రెండున్నరేళ్ల వయసులో అనారోగ్యంతో కోల్‌కతాలోని ముకుందాపుర్ ఏఎమ్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో చేరింది. ఆనాటి నుంచి ఐదేళ్లుగా వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటోంది. ఇప్పుడు ఆ చిన్నారి వయసు ఏడేళ్లు. ఇప్పటికీ ఆమె ఆరోగ్యం మెరుగు పడలేదు. ప్రస్తుతం సౌమిలి.. ఏఎమ్‌ఆర్‌ఐ ఆస్పత్రి, పీడియాట్రిక్ ఐసీయూ విభాగాధిపతి డాక్టర్ సౌమెన్ మీర్ పర్యవేక్షణలో ఉంది. అయితే ఏదైనా అద్భుతం జరిగిదే తప్ప.. మిగతా పిల్లలలాగా ఆ చిన్నారి నవ్వలేదని, ఆడుకోలేదని డాక్టర్ సౌమెన్ మీర్ అన్నారు. ఇంకా ఎన్నిరోజులు బతుకుతుందో అనేది తమముందు ఉన్న పెద్ద ప్రశ్న అని 'ఈటీవీ భారత్'కు ఆయన వెల్లడించారు.
"ఆ చిన్నారి 2017లో శ్వాస సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. అప్పుడు ఆ చిన్నారి వయసు రెండున్నర సంవత్సరాలు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడేది. వెన్నెముక, మెడ పరీక్షల అనంతరం.. మెడలో కణతి ఉందని తేలింది. దీన్నే వైద్య పరిభాషలో 'న్యూరోసైగ్లోమెట్రోసిస్(neurocyglometrosis)' అంటారు. ఈ వ్యాధి వచ్చిన వారికి నరంపై కణతి పెరుగుతుంది. ఈ చిన్నారికి అలా కణతి పెరిగి పుర్రెపై ఒత్తిడిని పెరిగింది. దాంతో ఆమె పుర్రె డ్యామేజ్ అయ్యింది. అందుకే ఆమె శరీర భాగాలు సరిగా స్పందించలేకపోతున్నాయి. దీంతో ఆమె శరీరం భుజాల నుంచి కాళ్ల వరకు చచ్చుబడిపోయింది. దీనికి ఆమెకు శ్వాస సమస్య కూడా తోడైంది. అందుకే ఆమెను వెంటిలేటర్‌పై ఉంచాము. అది తీసేస్తే రెండు నిమిషాల్లో చిన్నారి చనిపోతుంది"
- సౌమెన్ మీర్, డాక్టర్