ఉత్తర్ప్రదేశ్లో అమానవీయ ఘటన వెలుగు చూసింది. ఐదేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. బదాయు జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
ఏం జరిగింది?
సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన చిన్నారి.. ఆదివారం రాత్రి తన కుటుంబంతో కలిసి గోధుమలు తీసుకువచ్చేందుకు పొలానికి వెళ్లింది. ఈ క్రమంలో పొలంలో దాక్కున్న నిందితుడు.. బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. చిన్నారి అరిచేందుకు ప్రయత్నించగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు.
నిందితుడి వయస్సు 20 ఏళ్లు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. అతడు ఉద్ధామ్ సింగ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి అని చెప్పారు. ఓ చికిత్స నిమిత్తం ఆ వ్యక్తిని తన కుటుంబసభ్యులు.. సమీపంలో ఉన్న ఓ ఆధ్యాత్మిక ప్రదేశానికి తీసుకువచ్చారని చెప్పారు. అయితే.. అతడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడని తెలిపారు.
మృతదేహం వద్ద..
బాలిక ఇంట్లో కనిపించకపోగా వెతుకుతున్న కుటుంబ సభ్యులకు.. చిన్నారి మృతదేహం వద్ద ఓ వ్యక్తి కనిపించాడు. దాంతో అతడిపై వారు దాడి చేసి.. పోలీసులకు అప్పగించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్టు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
ఇదీ చూడండి:ఆసుపత్రిలో పడక కోసం గొడవ.. రోగి మృతి