2019-20 విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభా గ్రేడింగ్ సూచీలో అయిదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సత్తా చాటాయి. కేంద్ర విద్యాశాఖ ఆదివారం ఈ సూచీని ప్రకటించింది. దీనిలో పంజాబ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలైన చండీగఢ్, అండమాన్ నికోబార్‌లు ఏ-ప్లస్-ప్లస్ గ్రేడ్‌ను సంపాదించాయి.
దిల్లీ, గుజరాత్, హరియాణా, రాజస్థాన్, పుదుచ్చేరి, దాద్రానగర్ హవేలీకి ఏ-ప్లస్ గ్రేడ్ వచ్చింది. విద్యావ్యవస్థ పాలనా నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ సహా 7 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ పనితీరును 20శాతం మెరుగుపర్చుకున్నాయి. మరో 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 10శాతం పురోగతి సాధించాయి. 70 అంశాల ఆధారంగా ఈ గ్రేడింగ్‌ను నిర్ణయించారు.