5 States Election Date 2023 :2024 సార్వత్రిక సమరానికి ముందు కీలకమైన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది భారత ఎన్నికల సంఘం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. రాజస్థాన్‌కు నవంబర్ 23న, మధ్యప్రదేశ్‌కు నవంబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో పోలింగ్ జరపనున్నట్లు ఈసీ తెలిపింది. నవంబర్7, 17వ తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. మిజోరంలో నవంబర్ 7న.. చివరగా తెలంగాణకు నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు ఈసీ ప్రకటించింది. షెడ్యూల్ విడుదలతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినట్లైంది.
- ఐదు రాష్ట్రాల్లో మొత్తం ఓటర్లు- 16కోట్లు
- పురుష ఓటర్లు- 8.2కోట్లు
- మహిళా ఓటర్లు- 7.8కోట్లు
- తొలిసారి ఓటు వేసేవారు- 60.2 లక్షలు
- మొత్తం పోలింగ్ స్టేషన్లు- 1.77 లక్షలు
- రాజస్థాన్ ఎన్నికల షెడ్యూల్
- నోటిఫికేషన్ విడుదల తేదీ: అక్టోబర్ 30
- నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: నవంబర్ 6
- నామినేషన్ల పరిశీలన: నవంబర్ 7
- నామినేషన్ల ఉపసంహరణ గడువు: నవంబర్ 9
- రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ: నవంబర్ 23
- రాజస్థాన్ ఎన్నికల ఫలితాల తేదీ: డిసెంబర్ 3
- మొత్తం ఓటర్లు: 5.25 కోట్లు
- మధ్యప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్
- నోటిఫికేషన్ విడుదల తేదీ : అక్టోబర్ 21
- నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: అక్టోబర్ 30
- నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 31
- నామినేషన్ల ఉపసంహరణ గడువు: నవంబర్ 2
- మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ: నవంబర్ 17
- మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాల తేదీ: డిసెంబర్ 3
- మొత్తం ఓటర్లు: 5.6 కోట్లు
- ఛత్తీస్‌గఢ్ ఎన్నికల షెడ్యూల్
- నోటిఫికేషన్ విడుదల తేదీ : అక్టోబర్ 13 (తొలి విడత), అక్టోబర్ 21 (రెండో విడత)
- నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: అక్టోబర్ 20(తొలి), అక్టోబర్ 30(రెండో)
- నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 21(తొలి), అక్టోబర్ 31(రెండో)
- నామినేషన్ల ఉపసంహరణ గడువు: అక్టోబర్ 23(తొలి), నవంబర్ 2(రెండో)
- ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ: నవంబర్ 7 (తొలి విడత), నవంబర్ 17 (రెండో విడత)
- ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఫలితాల తేదీ: డిసెంబర్ 3
- మొత్తం ఓటర్లు: 2.03 కోట్లు
- మిజోరం ఎన్నికల షెడ్యూల్
- నోటిఫికేషన్ విడుదల తేదీ : అక్టోబర్ 13
- నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: అక్టోబర్ 20
- నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 21
- నామినేషన్ల ఉపసంహరణ గడువు: అక్టోబర్ 23
- ఎన్నికల పోలింగ్ తేదీ: నవంబర్ 7
- ఎన్నికల ఫలితాల తేదీ: డిసెంబర్ 3
- మొత్తం ఓటర్లు: 8.52లక్షలు
ఏ రాష్ట్రంలో ఎలా?
ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు వచ్చే ఏడాది జనవరిలో గడువు ముగియనుంది. మిజోరం ప్రభుత్వానికి డిసెంబర్ 17 వరకు గడువు ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఒకేసారి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఐదు రాష్ట్రాల ప్రస్తుత రాజకీయ ముఖచిత్రాన్ని ఓసారి పరిశీలించి చూస్తే..
మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు కొనసాగుతోంది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 230 సీట్లు ఉండగా అందులో బీజేపీకి 128 మంది సభ్యులు ఉన్నారు. విపక్ష కాంగ్రెస్‌కు 98 మంది బలం ఉంది. బీఎస్పీకి ఒక ఎమ్మెల్యే ఉండగా.. స్వతంత్రులు ముగ్గురు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
2018లో జరిగిన ఎన్నికల్లో 114 గెలుచుకున్న కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 109 స్థానాలు కైవసం చేసుకుంది. మెజారిటీకి 116 మంది సభ్యులు అవసరం కాగా.. బీఎస్పీ, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్. అయితే, 2020 మార్చిలో అప్పటి కాంగ్రెస్ కీలక నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పింది. ఆయనతో సహా 22 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం వల్ల కాంగ్రెస్ కమల్‌నాథ్ సర్కారు కూలిపోయింది. దీంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన నేతలంతా బీజేపీలో చేరారు.