ఉత్తర్ ప్రదేశ్ గాజియాబాద్‌లో దారుణం జరిగింది. 36 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు కామాంధులు. రెండు రోజుల పాటు అతి కిరాతకంగా సామూహిక అత్యాచారం చేశారు. ఆమె ప్రైవేట్ భాగాల్లో ఇనుప రాడ్డులను చొప్పించారు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ దారుణానికి ఆస్తి తగాదానే కారణమని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై దిల్లీ మహిళా కమిషన్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
నందగ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే బాధితురాలు.. అక్టోబర్ 16న తన సోదరుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు బయలుదేరింది. రోడ్డుపై ఆటో కోసం ఎదురుచూస్తుండగా.. ఐదుగురు వ్యక్తులు వచ్చి ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించుకుని తీసుకెళ్లారు. బాధితురాలిని అపహరించిన నిందితులు రెండు రోజుల పాటు ఆమెపై అతి కిరాతకంగా సామూహిక అత్యాచారం చేశారు. ఆమె ప్రైవేట్ భాగాల్లో ఇనుప రాడ్డును చొప్పించారు. అనంతరం ఆమె చేతులు, కాళ్లు కట్టేసి రోడ్డుపై వదిలేసి వెళ్లారు. బాధితురాలు రోడ్డుపై కనిపించేవరకు ఇనుప రాడ్డు ఆమె ప్రైవేట్ భాగాల్లోనే ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. బాధితురాలికి, నిందితులకు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నట్లు తెలిపారు.
కూర వండలేదని తల్లిని చంపిన తనయడు: తనకు ఇష్టమైన కూర వండలేదని తల్లిని చంపేశాడు ఓ తనయుడు. ఈ దారుణ ఘటన పంజాబ్ లూథియానాలోని అశోక్ నగర్లో జరిగింది.
ఇష్టమైన కూర వండలేదని ఆగ్రహించిన కుమారుడు సురీందర్ సింగ్.. తన తల్లి చరణ్‌జీత్‌ను దారుణంగా కొట్టాడు. మేడపై నుంచి కిందకు తోసి ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. అడ్డుకోబోయిన తండ్రిని తీవ్రంగా కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన చరణ్‌జీత్‌ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సురీందర్ సింగ్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని స్థానికులు చెబుతున్నారు.
సోషల్ మీడియాలో పరిచయం.. పార్క్‌కు పిలిచి రేప్ : 15 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలో వెలుగు చూసింది. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తే.. పబ్లిక్ పార్కులో ఈ దారుణానికి తెగబడ్డాడు. బాలిక తన తల్లి ఫోన్లో ఇన్స్టాగ్రామ్ వినియోగిస్తుండగా.. కాన్పుర్‌కు చెందిన విద్యాసాగర్ కుశ్వాహతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే లఖ్‌నవూలోని లోహియా పార్కులో కలుసుకుందామని పిలిచాడు. అక్కడకు వచ్చిన బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఇంటికి వెళ్లిన బాలిక తల్లిదండ్రులకు చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కాన్పుర్ వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు గుజరాత్లో పనిచేస్తాడని.. బాలికను కలిసేందుకే స్వగ్రామమైన కాన్పుర్ వచ్చి.. అక్కడినుంచి లఖ్‌నవూ చేరుకున్నాడని పోలీసులు వెల్లడించారు.