Five Killed In Same Family: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన జరిగింది. ప్రయాగ్రజ్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని దుండగులు హత్య చేశారు. మృతుల్లో 15 ఏళ్ల లోపు వయసు ఉన్న ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. నవబ్గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న ఖగల్‌పుర్ గ్రామానికి చెందిన రాహుల్ (42), అతడి భార్య ప్రీతి (38), వారి కుమార్తెలు మహి (15), పిహు (13), కుహు (11) వారి ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసుల ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ అగర్వాల్ తెలిపారు. విచారణ కోసం ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్‌ను ఉపయోగిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందించారు. భాజపా రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక.. నేరాలు బాగా పెరిగాయని ఆరోపించారు. " భాజపా 2.0 పాలనలో, ఉత్తరప్రదేశ్‌లో నేరాలు పెరిగిపోయాయి. ఇదిగో నేరాల చిట్టా " అని ఆయన హిందీలో ఒక న్యూస్ ఛానెల్ స్క్రీన్‌షాట్‌తో పాటు ట్వీట్ చేశారు.