చిన్నపిల్లలు తల్లిని బొమ్మలో, ఆట వస్తువులో అడుగుతారు. ఇక్కడ నాలుగో తరగతి చదివే ఓ పాప మాత్రం తల్లికి లెటర్ రాసి 50 వేల రూపాయలు డిమాండ్ చేసింది. ఇవ్వకపోతే నీ పెద్ద కూతురిని చంపేస్తానని బెదిరించింది. ఈ ఆశ్చర్యకర ఘటన ఉత్తర్ ప్రదేశ్లో జరిగింది. సోమవారం తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
'రూ.50వేలు ఇవ్వు.. లేదంటే ఆమెను చంపేస్తా'.. తల్లికి 4వ తరగతి విద్యార్థి లేఖ - పెద్ద కూతరిని చంపేస్తానని తల్లీకి కూతురి లెటర్
నాలుగో తరగతి చదివే ఓ పాప తల్లికి లెటర్ రాసి 50 వేల రూపాయలు డిమాండ్ చేసింది. ఇవ్వకపోతే తన పెద్ద కూతురిని చంపేస్తానని బెదిరించింది. ఈ ఆశ్చర్యకర ఘటన ఉత్తర్ ప్రదేశ్లో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. మేఘా పాండే అనే మహిళ యూపీ కాన్పుర్లోని మస్వాన్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భర్త, ఇద్దరు పిల్లలతో కలసి నివసిస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా ఆమెకు కొన్ని బెదిరింపు లేఖలు వస్తున్నాయి. 50వేల రూపాయలు ఇవ్వాలని, లేదంటే తన పెద్ద కూతురిని చంపేస్తామని ఆ లేఖల్లో ఉంది. దీంతో భయపడిపోయిన మహిళ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధిత మహిళ ఇంటికి దర్యాప్తు కోసం వెళ్లారు. వివిధ కోణాల్లో పరిశోధన చేసిన అనంతరం అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ బెదిరింపు లేఖలు రాస్తున్నది పాండే కూతురేనని నిర్ధరించారు. పాప చేతి రాత, నోట్ పుస్తకాల ఆధారంగా ఈ విషయం తెలుసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు పాపను పశ్నించగా, తానే లెటర్లు రాసి గేట్పై ఉంచేదాన్ని అని చెప్పింది. ఎవరైనా రాయమని చెప్పారా? అని అడగగా తానే సొంతంగా రాసినట్లు తెలిపిందని పోలీసులు పేర్కొన్నారు. చివరగా పాపకు ఇలాంటి పనులు ఇకముందు చెయ్యవద్దని చెప్పినట్లు వారు తెలిపారు.