పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించింది ఓ మహిళ. 49 ఏళ్ల వయసులో హోంగార్డు ఉద్యోగం సాధించింది. ఈ కొలువు కోసం దాదాపు 14 ఏళ్లు వేచి చూసింది. తాజాగా నియామక పత్రం.. ప్రభుత్వం నుంచి అందింది. దీంతో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఆమే బిహార్‌కు చెందిన రేణు దేవి. ఆమె విజయ గాథ ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
వైశాలి జిల్లాలోని హాజీపుర్‌కు చెందిన రేణు దేవికి 1990లో వివాహం అయ్యింది. ఆమెకు ముగ్గురు సంతానం. ఆమె హోంగార్డు ఉద్యోగం కోసం 2009లో దరఖాస్తు చేసుకుంది. సంబంధిత అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. అయితే రేణు దేవికి అపాయింట్‌మెంట్ లెటర్ లభించలేదు. నియామకం పత్రం అందుతుందన్న ఆశతో ఆమె దాదాపు 14 ఏళ్లు వేచి చూసింది. చివరకు ఉద్యోగం మీద ఆశలు వదులుకుంది. ఈ 14 ఏళ్లలో రేణు దేవి తన ముగ్గురు కుమారులకు వివాహం కూడా చేసేసింది. ఆమెకు ప్రస్తుతం రెండేళ్ల మనవడు ఉన్నాడు. ప్రస్తుతం రేణు దేవి వయసు 49 ఏళ్లు.
2009లో హోంగార్డు జాబ్ కోసం దరఖాస్తు చేశా. అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించా. అపాయింట్‌మెంట్ లెటర్ వస్తుందని 14 ఏళ్లు ఎదురుచూశా. ఆఖరికి ఉద్యోగం రాదని ఆశ వదులుకున్నా. ఇప్పుడు అపాయింట్‌మెంట్ లెటర్ రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఇప్పుడు రెండేళ్ల వయసున్న మనవడు ఉన్నాడు. మా కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషంగా ఉన్నారు.