ఆయనది ఓ పల్లెటూరు. జన్మించింది సామాన్య రైతు కుటుంబంలో. చదివింది వీధి బడిలో. ఆ స్థాయి నుంచి నేడు దేశ సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి స్థాయిని అందుకున్నారు తెలుగుతేజం జస్టిస్ నూతలపాటి వెంకట రమణ. మూడు దశాబ్దాల న్యాయవాద జీవితంలో.. రాజ్యాంగ, క్రిమినల్, సర్వీస్, అంతర్రాష్ట్ర నదీ జలాల సంబంధిత కేసుల్లో నిష్ణాతులుగా పేరు గడించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేసిన ఆయన.. భారతదేశ 48వ ప్రధాన న్యాయమూర్తిగా శనివారం బాధ్యతలు చేపట్టారు.
న్యాయవాద ప్రస్థానం..
1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు జస్టిస్ ఎన్.వి. రమణ. సివిల్, క్రిమినల్ చట్టాలతో పాటు రాజ్యాంగపరమైన అంశాలలో ఆయన దిట్ట. రాజ్యాంగపరమైన వివాదాలు, కార్మిక చట్టాలు, ఎన్నికల సర్వీసులకు సంబంధించిన కేసులపై న్యాయవాదిగా హైకోర్టు, సుప్రీంకోర్టులతో పాటు.. కేంద్ర, రాష్ట్ర పరిపాలనా ట్రైబ్యునళ్లలో వాదనలు వినిపించారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున.. అదనపు స్టాండింగ్ కౌన్సెల్‌గానూ, హైదరాబాద్‌లోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌లో రైల్వేశాఖకు స్టాండింగ్ కౌన్సెల్‌గానూ పనిచేశారు జస్టిస్ రమణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అదనపు అడ్వొకేట్ జనరల్‌గానూ సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీ అధ్యక్షుడిగానూ పనిచేశారు.