అయోధ్య రాముడి కోసం 45 టన్నుల లడ్డూలు- ప్రసాదంగా ఇంకా ఏమేం ఇస్తారంటే? 45 Tonnes Of Laddu Prasad For Pran Pratishtha :అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ తర్వాత భక్తులకు పంచడం కోసం 45 టన్నుల లడ్డూలు సిద్ధమవుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ వారణాసికి చెందిన మిఠాయి తయారీదారులు ఇందుకోసం నిర్విరామంగా పనిచేస్తున్నారు. ఏకాభిప్రాయ సాధన తర్వాతే అయోధ్య రామాలయం నిర్మించాలని సూచించిన దివంగత సాధువు దేవ్రా బాబా తరఫున 1,111 లడ్డూలను రాముడికి నైవేద్యంగా సమర్పించనున్నారు. ఈ లడ్డూలతోపాటు మరికొన్ని మతపరమైన వస్తువులను భక్తులకు ఇవ్వనున్నారు.
"రామాలయానికి వచ్చే ప్రముఖులకు ఈ లడ్డూలను ప్రసాదంగా ఇస్తారు. ఓ పుస్తకం, సంచి, రామ నామం ఉన్న వస్త్రం, మఖానా(తామర గింజలు),లడ్డూల పెట్టె వారందరికీ అందజేస్తారు. మొత్తం 54,440 కిలోల బరువు ఉండేలా 1,111 లడ్డూలు చేస్తున్నాం. వాటితోపాటు మరో 13.5లక్షల లడ్డూలను చేయాల్సి ఉంది."
--రతన్ లాల్ అగర్వాల్, మిఠాయి తయారీదారుడు
స్వచ్ఛమైన దేశీ ఆవు నెయ్యి, యాలకులు, జీడిపప్పు, కుంకుమ పువ్వుతో ఈ లడ్డూలను తయారు చేస్తున్నారు. ఇవి 3-4నెలలపాటు పాడవకుండా ఉంటాయట.
అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ లడ్డూ ప్రసాదం
"స్వచ్ఛమైన దేశీ ఆవు నెయ్యి వాడుతున్నాం. కిలో నెయ్యి, కిలో శెనగపిండి, కిలో చక్కెర కలిపి లడ్డూలు చేస్తున్నాం. వారణాసిలోని హనుమంతుడికి ఇవి ఎంతో ఇష్టమైనవి."
--అశోక్ యాదవ్, లడ్డూ తయారీదారుడు
రామాలయానికి వచ్చే ప్రముఖులు, సాధారణ భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఫిబ్రవరి వరకు ఈ లడ్డూలను సరఫరా చేయనున్నారు.
లడ్డూలు తయారుచేస్తున్న సిబ్బంది ప్రసాదంగా 'ఇలాచి దానా'
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం ఈనెల 22న అట్టహాసంగా జరగనుంది. రామయ్య దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రసాదంగా 'ఇలాచి దానా'ను అందించనున్నట్లు ఇటీవల తెలిపింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. పంచదార, యాలకులతో ఈ ఇలాచి దానాను తయారు చేస్తారు. దేశంలోని కొన్ని ముఖ్యమైన ఆలయాల్లో ఇప్పటికే ఇలాచి దానాను భక్తులకు ప్రసాదంగా అందిస్తున్నారు. ఈ ప్రసాదం తయారు చేసే బాధ్యతను అయోధ్యలోని రామ్‌విలాస్ అండ్ సన్స్ దుకాణానికి అప్పగించింది అయోధ్య రామాలయ ట్రస్ట్. ఈ ఇలాచి దానా తింటే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయట. అవేంటో తెలుసుకునేందుకుఈ లింక్‌పై క్లిక్ చేయండి.