అది మే 24 2022.. కృష్ణ ప్రసాద్(21).. ఉదయం లేచినప్పటి నుంచి పదేపదే మొబైల్ ఫోన్ వైపే చూస్తున్నాడు. ఏదైనా కాల్ లేదా మెసేజ్ వస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఇక ఓపిక పట్టలేక.. తానే ఒకరికి కాల్ చేశాడు. కానీ.. అటు వైపు నుంచి సరిగా స్పందన లేదు. దీంతో బాగా హర్ట్ అయ్యాడు. రోజంతా ఎంతో బాధపడ్డాడు. సాయంత్రానికి ఆ బాధ కాస్తా కోపంగా మారింది. అవతలి వ్యక్తి కాల్ చేసినా ఆన్సర్ చేయలేదు. వాట్సాప్‌లో ఆ నంబర్‌ను బ్లాక్ చేసేశాడు కృష్ణ ప్రసాద్.
కృష్ణ ప్రసాద్‌ది.. కేరళలోని ఇడుక్కి. ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. అతడిని ఇంతలా బాధపెట్టిన వ్యక్తి.. అక్క కృష్ణప్రియ(28). మే 24న బ్రదర్స్ డే అయినా.. ఆమె తనకు శుభాకాంక్షలు చెప్పలేదన్నదే అతడి ఆవేదన. ఇంజినీర్‌గా పనిచేస్తున్న కృష్ణ ప్రియకు విషయం ఆలస్యంగా అర్థమైంది. తప్పును సరిదిద్దుకుంటూ.. తమ్ముడంటే ఎంత ప్రేమో తెలియచేయాలని అనుకుంది. అందుకోసం ఏం చేసిందో ఆమె మాటల్లోనే...
"బ్రదర్స్ డే విషెస్ చెప్పడం మర్చిపోయా. అందుకే తమ్ముడు నాతో ఫోన్లో మాట్లాడడం మానేశాడు. వాట్సాప్‌లో నా నంబర్ బ్లాక్ చేశాడు. అందుకే లేఖ రాయాలని అనుకున్నా. A4 సైజ్ షీట్స్‌పై రాయడం మొదలుపెట్టా. కానీ.. తమ్ముడికి నేను చెప్పాలని అనుకున్న విషయం రాసేందుకు ఇవి సరిపోవని అర్థమైంది. అందుకే ఇంకా పొడవైన పేపర్లు కొనాలని అనుకున్నా. మార్కెట్‌కు వెళ్లి అడిగితే.. అలాంటివి ఉండవన్నారు. బిల్లింగ్ రోల్స్ మాత్రమే ఉంటాయని చెప్పారు. 14 బిల్లింగ్ రోల్స్ కొని ఇంటికి తెచ్చా. మొత్తం లేఖ రాసేందుకు 12 గంటలు పట్టింది. చివరకు ఆ లేఖ 434 మీటర్లు పొడవు, 5 కేజీల బరువు ఉంది." అంటూ తన భారీ లేఖ విశేషాలు చెప్పింది కృష్ణ ప్రియ.
లేఖలో ఏముంది?:"కృష్ణ ప్రసాద్ జీవితం గురించి మొత్తం వివరాలు ఈ లేఖలో రాశా. వాడు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఇంజినీరింగ్ విద్యార్థిగా ఉన్న నాటి వరకు సంగతులు, మేం కలిసి గడిపిన క్షణాలు, మా మధ్య ప్రేమ.. ఇలా ప్రతి విషయం ప్రస్తావించా. తమ్ముడు(కృష్ణప్రసాద్)నాకన్నా ఏడేళ్లు చిన్నవాడు. వాడికి నేనంటే గౌరవం. నన్ను ఒక తల్లిలా, టీచర్లా చూసి.. కాస్త భయపడుతుంటాడు. మేము చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. చాలా స్నేహపూర్వకంగా, కవలల్లా ఉండేవాళ్లం. ఏదైనా పండుగ అయితే.. ఒకే రంగు దుస్తులు ధరించేవాళ్లం" అని తమ్ముడితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని మురిసిపోయింది కృష్ణ ప్రియ.