ED Raids in Parekh Aluminex : బ్యాంకుల్ని మోసం చేసి రూ.వేల కోట్లు రుణాలు తీసుకున్న ఓ సంస్థకు సంబంధించిన కేసులో ఈడీ సోదాలు జరిపింది. ఈ సోదాల్లో మూడు రహస్య లాకర్ల నుంచి భారీగా బంగారం కడ్డీలు, వెండిని స్వాధీనం చేసుకుంది. వీటి విలువ దాదాపు రూ.47 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
పరేఖ్ అల్యూమినెక్స్ లిమిటెడ్ అనే కంపెనీ పలు బ్యాంకుల నుంచి రూ.2,296.58 కోట్లు రుణం తీసుకొని మోసానికి పాల్పడిందన్న ఆరోపణలపై 2018లో ఆ కంపెనీపై మనీలాండరింగ్ కేసు నమోదైంది. అయితే, ఈ కేసు విచారణలో భాగంగా రక్షా బులియన్, క్లాసిక్ మార్బల్స్ కంపెనీలపై తాజాగా ఈడీ సోదాలు జరపగా.. రక్షా బులియన్ సంస్థకు సంబంధించి కొన్ని ప్రైవేటు లాకర్లు ఉన్నట్టు గుర్తించినట్టు ఈడీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
అయితే, ఈ ప్రైవేటు లాకర్లను తెరిచిన అధికారులు వాటిలో ఉన్న బంగారం, వెండిని చూసి షాక్ అయ్యారు. అలాగే, సరైన నిబంధనలు పాటించకుండా ఈ లాకర్లు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. అంతేకాకుండా, కైవేసీ పాటించకపోవడం, ఆ ప్రాంగణంలో సీసీ కెమెరాలు లేకపోవడం, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారనే సమాచారం తెలిపే సరైన రిజిస్టర్ కూడా నిర్వహించలేదని గుర్తించినట్టు ఈడీ అధికారులు ప్రకటనలో తెలిపారు.