మహారాష్ట్ర పుణెలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. తండ్రీకొడుకులు ఇద్దరూ పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. తాజాగా మహారాష్ట్ర సెకండరీ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో తండ్రి పాస్ కాగా.. కుమారుడు మాత్రం ఫెయిల్ అయ్యాడు. తాను పాస్ అయినందుకు సంతోషంగా ఉన్నా.. కుమారుడు రెండు పేపర్లలో ఫెయిల్ అయ్యాడని బాధగా ఉందన్నాడు తండ్రి భాస్కర్. సప్లిమెంటరీ పరీక్షల కోసం తన కొడుకుకు సాయం చేస్తానని చెప్పాడు.
పుణెకు చెందిన భాస్కర్ వాఘ్మరె ఏడో తరగతిలో ఉండగా.. కుటుంబ సమస్యలతో మధ్యలోనే చదువును ఆపేశాడు. ఆ తర్వాత కుటుంబ బాధ్యతను తీసుకున్నాడు. తిరిగి 30 ఏళ్ల తర్వాత తన కుమారుడితో కలిసి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. పుణెలో ప్రైవేట్ సంస్థలో పని చేస్తానని.. రోజూ పని పూర్తయ్యాక వచ్చి పరీక్షలకు చదువుకునే వాడినని భాస్కర్ చెప్పాడు.
"నేను ఎంతో చదవాలి అనుకున్నాను. కానీ కుటుంబ బాధ్యతలు తీసుకుని మధ్యలోనే చదువును ఆపేశాను. చదువును కొనసాగిస్తే మరింత సంపాదించొచ్చు అనుకొని.. పది పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నాను. నా కుమారుడు పదో తరగతి చదువుతుండడం వల్ల నాకు సహాయం చేసేవాడు."
- భాస్కర్ వాఘ్మరె, తండ్రి