కేరళలో వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో అక్టోబర్ 12 నుంచి 20వరకు 42 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. మరో ఆరుగురు గల్లంతయినట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం 304 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీరందరినీ ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. త్వరలోనే వారికి సాయం అందుతుందన్నారు.
ఆరెంజ్ అలర్ట్ వెనక్కి..
బుధవారం కేరళలోని 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన భారత వాతావరణ శాఖ(ఐఎండీ) దాన్ని వెనక్కి తీసుకుని యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలే కురుస్తున్నట్లు తెలిపింది. అక్టోబర్ 21 మరో 9 జిల్లాలకు జారీ చేసిన ఆరెంజ్ అలెర్ట్‌ను కూడా ఐఎండీ ఉపసంహరించుకుంది. అయితే ఇడుక్కి, కొట్టాయం, పథనంతిట్ట జిల్లాల్లో మాత్రం గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వారం రోజులుగా కురిస్తున్న భారీ వర్షాలకు కేరళ అతలాకుతలమైంది. అనేక ప్రాంతాలు నిటమునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొండ చరియలు విరిగి పడి పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు.