ఛత్తీస్‌గఢ్ బీజాపుర్ దండకారణ్యంలో జరిగిన భీకర ఎన్‌కౌంటర్ గురించి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్(ఎస్టీఎఫ్), కోబ్రా బెటాలియన్ జవాన్లు మరిన్ని విషయాలు వెల్లడించారు. భద్రత దళాలపై దాదాపు 400 మంది మావోయిస్టులు అనుహ్యంగా దాడి చేశారని ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ దేవ్ ప్రకాశ్ తెలిపాడు. వారికి పట్టున్న ప్రాంతంలో పథకం ప్రకారం అన్ని వైపుల నుంచి ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిపించారని పేర్కొన్నాడు.
"నక్సల్స్‌కు దీటుగా జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఐదు గంటల పాటు ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ పోరులో భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అయితే పలువురు మావోయిస్టులను హతమార్చాం" అని ప్రకాశ్ చెప్పుకొచ్చారు.
ప్రతీకారం తీర్చుకుంటాం
"నక్సల్స్ అన్ని వైపుల నుంచి బుల్లెట్లు వర్షం కురిపించారు. భారీ కాల్పుల మధ్య, భద్రతా సిబ్బంది మృతదేహాలను మరొక ప్రదేశానికి తరలించడం చాలా కష్టమైంది. అయితే భవిష్యత్తులో మావోయిస్టులపై జవాన్లు తమ పోరాటాన్ని మరింత శౌర్యంతో కొనసాగిస్తారు" అని మరో జవాన్ పేర్కొన్నారు.