ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడ్డాడు 26 ఏళ్ల వ్యక్తి. ఈ ఘటన బులంద్‌శహర్ జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జహంగీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలిక నివసిస్తోంది. ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది. కొద్దిసేపటి తర్వాత కనిపించకుండా పోయింది. బాలిక పొరుగింట్లో ఉన్న ఓ వ్యక్తి ఆమెను మభ్యపెట్టి.. తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు. తన విషయం బయటపడుతుందని హత్య చేశాడు.
ఈ క్రమంలో కనిపించకుండా పోయిన బాలిక కోసం కుటుంబ సభ్యులు కొన్ని గంటల పాటు వెతికారు. అలా తమ పొరుగింట్లో వెతకగా.. మంచం కింద బాలిక విగతజీవిగా పడి ఉంది. మృతదేహం పక్కనే మద్యం మత్తులో నిందితుడు పడి ఉన్నాడు. కోపోద్రిక్తులైన బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు.. నిందితుడిని చితకబాదారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులకు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలం నుంచి రక్తంతో తడిచిన బాలిక దుస్తులను, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని కూడా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.