మధ్యప్రదేశ్లో గాల్వియర్ జిల్లాలో ఓ వింత శిశువు జన్మించింది. నాలుగు కాళ్లతో పుట్టిన ఈ పాప అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. సికిందర్ కాంపూ ప్రాంతానికి చెందిన ఆర్తి కుష్వాహా అనే మహిళ బుధవారం ఈ శిశువుకు జన్మనిచ్చింది. అయితే శిశువుకు ఇంకా ఏమైనా ఇతర వైకల్యం ఉందా అనే అనుమానంతో పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ వైద్యులు పరీక్షిస్తున్నారు. ఈ నవజాత శిశువు ప్రస్తుతం రాజా అస్పత్రిలోని స్పెషల్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతుంది. 2.3 కిలోల బరువుతో పుట్టిన ఈ శిశువు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు.
"గర్భధారణలో కొన్ని పిండాలు అదనంగా ఉంటాయి. వీటిని వైద్య భాషలో ఇస్కియోపాగస్ అంటారు. ఇలాంటి సందర్భాలలో పిండం రెండు భాగాలవుతుంది. శిశువు శరీర భాగాలు రెండు చోట్ల అభివృద్ధి చెందుతాయి. అయితే ఈ పాప విషయంలో కూడా అలాగే జరిగి నాలుగు కాళ్లతో పుట్టింది. వైద్య పరీక్షల తర్వాత బిడ్డ ఆరోగ్యంగా ఉందని తేలితే.. ఆపరేషన్ చేసి అదనంగా వచ్చిన ఆ కాళ్లను తొలగిస్తాం. తద్వారా ఆమె సాధారణ జీవితం గడపవచ్చని" ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్కేఎస్ ధాకడ్ తెలిపారు.