Secunderabad Gold Theft Case Update : రాష్ట్రంలో సంచలనంగా మారిన ఐటీ అధికారుల ముసుగులో చోరీకి పాల్పడిన ఘటనలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. చోరీకి పాల్పడిన నలుగురు నిందితులు జాకీర్, రహీమ్, ప్రవీణ్, అక్షయ్‌లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. చోరీ చేసిన తర్వాత నిందితులంతా మహారాష్ట్రకు వెళ్లిపోయారని.. అక్కడికి వెళ్లి వారిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
ఇదీ జరిగింది..: హైదరాబాద్‌లోని మోండా మార్కెట్‌లో రివెన్ మధుకర్ అనే వ్యాపారి బాలాజీ జ్యువెల్లరీ పేరిట నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇతడు పాత బంగారాన్ని కొనుగోలు చేసి.. దానిని శుద్ధి చేసి సమీపంలోని సిద్ధి వినాయక జువెల్లరీస్‌కు విక్రయిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తన సొంతూళ్లో పని ఉండటంతో వారం రోజుల క్రితం మధుకర్ ఊరెళ్లాడు. దిల్‌సుఖ్‌నగర్‌లో ఉండే తన బావ మరిది వికాస్‌కు తన దుకాణాన్ని చూసుకోమని చెప్పి వెళ్లాడు. అప్పటి నుంచి వికాస్.. తన బావ దుకాణాన్ని చూసుకుంటున్నాడు.
ఈ క్రమంలోనే శనివారం ఉదయం ఓ ఐదుగురు వ్యక్తులు బాలాజీ జ్యువెల్లరీ షాపులోకి వచ్చారు.ఐటీ అధికారులమని.. బంగారం కొనుగోళ్లలో అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని దుకాణ సిబ్బందిని బెదిరించారు. అటూ ఇటూ తిరుగుతూ.. హడావిడి చేశారు. సిబ్బందిని అక్కడి నుంచి పక్కకు వెళ్లగొట్టారు. అనంతరం షాపులో ఉన్న బంగారాన్ని పరిశీలించినట్లు నాటకమాడి 1.7 కిలోల బంగారానికి సంబంధించి ట్యాక్స్ కట్టలేదని.. దానిని స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు. అనంతరం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఆ బంగారంతో అక్కడి నుంచి ఉడాయించారు. సిబ్బందిని షాపులోనే ఉంచి బయట నుంచి తలుపులు వేసి పరారయ్యారు. వికాస్.. తోటి దుకాణదారులకు ఫోన్ చేయడంతో వాళ్లు వచ్చి తలుపులు తీశారు.
అనంతరం వికాస్.. మధుకర్‌కు ఫోన్ చేసి మొత్తం విషయం చెప్పాడు. దీంతో మధుకర్.. తన తోటి దుకాణదారులకు ఫోన్ చేసి సంగతి చెప్పాడు. అయితే ఐటీ అధికారులు అలా అకస్మాత్తుగా తనిఖీలు చేయరని.. ముందుగా నోటీసులు ఇచ్చి తర్వాతే దాడులు చేస్తారని తోటివారు చెప్పడంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సీసీ కెమెరా దృశ్యాల ద్వారా తనిఖీలకు వచ్చిన ఐదుగురు నకిలీ ఐటీ అధికారులుగా తేల్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే నిందితులు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించి.. అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు.
ఇవీ చూడండి..
Gold Theft Case in Secunderabad : సికింద్రాబాద్ బంగారం చోరీ కేసు.. మహారాష్ట్ర ముఠా పనేనా?