ఇంటి అలంకరణ వస్తువులుగా వినియోగించేందుకు, ప్రత్యేక సందర్భాల్లో కానుకలుగా అందించేందుకు చేత్తో తయారైన వస్తువులకు ప్రాధాన్యం క్రమంగా పెరిగిపోతోంది. దేశంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో కళ ఆధారంగా ప్రత్యేక చేతివృత్తి ఉంటుంది. అలాంటి ఓ కళ ద్వారా తయారైన ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన గిరాకీ ఉంది. స్టీలు పళ్లెంపై అద్భుతమైన కళాఖండాన్ని చెక్కడమైనా, ఓ శిల్పాన్ని తీర్చిదిద్దడమైనా... చంబాకు చెందిన కళాకారుల తర్వాతే ఎవరైనా. చంబా కళాకారులు దేశంలోనే కాదు అంతర్జాతీయ వేదికలపైనా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పళ్లాలపై చిత్రాలు చెక్కగలరు వీళ్లు. ఈ కళకు ఆద్యుడు రాష్ట్రపతి చేతుల మీదుగా సన్మానం అందుకున్న 84 ఏళ్ల ప్రకాశ్‌చంద్.
"నేను పదకొండేళ్లప్పుడు ఈ పని ప్రారంభించాను. ఇప్పుడు నా వయసు 84 ఏళ్లు. పని కొనసాగించే సత్తువ నాకు లేదిప్పుడు. 1974లో రాష్ట్రపతి పురస్కారం దక్కింది. తర్వాత మధ్యప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలూ నన్ను సత్కరించాయి. నైపుణ్యాభివృద్ధి పథకం కింద యువతకు ప్రభుత్వం రెండు నెలలపాటు శిక్షణనిస్తోంది. కానీ ఈ కళను ఒంటబట్టించుకునేందుకు రెండునెలల సమయం సరిపోదన్నది నా అభిప్రాయం."
--ప్రకాశ్‌చంద్, శిల్పి
ఈ వృత్తిలోకి వచ్చినప్పుడు ప్రకాశ్‌చంద్ వయసు 11ఏళ్లు. దేశవ్యాప్తంగా ఆయన తయారుచేసిన వస్తువులకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. కానీ...వయసుపైబడడంతో ఆ పని కొనసాగించలేపోతున్నానని ఆవేదన చెందుతున్నాడు. స్టీలు ప్లేట్లపై ఎలాంటి చిత్రాన్నైనా చెక్కగలిగే ప్రతిభ ప్రకాశ్‌చంద్ సొంతం. ప్రకాశ్ కుమారుడు, మనవడు కూడా ఈ కళతోనే..ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులను ఆకర్షిస్తూ, ప్రత్యేకత చాటుకుంటున్నారు.
"విదేశాల్లో ఈ స్టీలు కళాఖండాలకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. ప్రత్యేక సందర్భాల్లో కానుకలుగా ఇచ్చేందుకు వీటిని కొనుగోలు చేస్తారు. 50 ఏళ్ల క్రితం మా నాన్న ఈ పని ప్రారంభించారు. మొట్ట మొదట స్టీలు ప్లేట్లపై చిత్రాలు చెక్కింది మా నాన్నే."
--రాజేశ్ ఆనంద్, ప్రకాశ్‌చంద్ కుమారుడు
ఒక్కో ప్లేటుపై చిత్రాలు చెక్కడానికి మూడు నుంచి నాలుగు రోజులు పడుతుంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ సహా..ఎందరో ప్రముఖుల చిత్రాలు ప్లేట్లపై చెక్కి, వారికి బహుమతిగా అందించాడు ప్రకాశ్‌చంద్.