370 Article Verdict Reactions : జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దును సమర్ధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కశ్మీర్ పార్టీలు వ్యతిరేకించగా, మిగిలిన పార్టీలు స్వాగతించాయి. సుప్రీం తీర్పును బీజేపీ, కాంగ్రెస్, శివసేన ఉద్దవ్ వర్గం స్వాగతించగా, కశ్మీర్ పార్టీలు నేషనల్ కాన్ఫరెన్స్, డీపీఏపీ పార్టీ వ్యతిరేకించాయి. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పును చారిత్రకమైనదిగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ తీర్పు కేవలం చట్టపరమైంది మాత్రమే కాదన్న ఆయన, జమ్ము కశ్మీర్‌కు ఉజ్వల భవిష్యత్తుకు వాగ్దానమని, అక్కడి సోదరసోదరీమణులకు ఆశాకిరణమని ట్వీట్ చేశారు.
"సుప్రీంకోర్టు ధర్మాసనం లోతైన జ్ఞానంతో ఐక్యతా సారాంశాన్ని మరింత బలపరిచింది. ప్రగతి ఫలాలు ఆ రాష్ట్ర ప్రజలకు చేరకుండా ఆర్టికల్ 370 అడ్డుకుంది. అలా నష్టపోయిన బలహీన, అట్టడుగు వర్గాలకు ప్రయోజనాలు అందించేందుకు నిబద్ధతతో ఉన్నాం"
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
సుప్రీం తీర్పుపై బీజేపీ హర్షం
ఆర్టికల్ 370 రద్దు అణగారిన వర్గాల హక్కులను పునరుద్ధరించిందని, వేర్పాటువాదం, రాళ్లదాడులు సమసిపోయాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఆ ప్రాంతమంతా ఇప్పుడు మధురమైన సంగీతం, సాంస్కృతిక వైభవంతో విరాజిల్లుతోందన్నారు. ఈ తీర్పుతో ఐక్యత మరోసారి కొనసాగిందని చెప్పారు. సుప్రీం తీర్పును స్వాగతిస్తోందని ఆపార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. జమ్ముకశ్మీర్‌ను జాతీయ భావజాలంలో చేర్చే చారిత్రక పనిని మోదీ ప్రభుత్వం చేసిందని, ఇందుకు కోట్లాది ప్రజల తరఫున ప్రధానికి కృతజ్ఞతలంటూ ట్వీట్ చేశారు.
తీర్పు నిరాశ పరిచిందన్న కశ్మీర్ పార్టీలు
ఆర్టికల్ 370 రద్దును సుప్రీం సమర్థించడాన్ని కశ్మీర్‌కు చెందిన పార్టీలు నిరాశ వ్యక్తం చేశాయి. ఈ తీర్పుతో తీవ్ర నిరాశ చెందానన్నారు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా. కానీ నిరుత్సాహం మాత్రం పడబోమని, జమ్ముకశ్మీర్ ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగిస్తామని ట్వీట్ చేశారు.