32 Lakh Died Of Corona In India: అధికారిక లెక్కల ప్రకారం భారత్‌లో ఇప్పటివరకు 4.8లక్షల కొవిడ్ మరణాలు నమోదైనప్పటికీ.. నమోదు కానివి భారీగా ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్ నాటికే దేశంలో దాదాపు 32లక్షల కొవిడ్ మరణాలు సంభవించి ఉండవచ్చని తాజా అధ్యయనం అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన తాజా అధ్యయనం జర్నల్ సైన్స్‌లో ప్రచురితమైంది.
డెల్టా వేరియంట్ ప్రభావానికి గతేడాది భారత్ వణికిపోయింది. రోజూవారి కేసుల సంఖ్య గరిష్ఠంగా 4లక్షలకు చేరింది. దీంతో లక్షల మంది కొవిడ్ బాధితులతో ఆస్పత్రులు కిటకిటలాడాయి. ముఖ్యంగా ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరతతో కొవిడ్ బాధితులు అల్లాడిపోయారు. అదే సమయంలో కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ టొరంటోకు చెందిన ప్రొఫెసర్ ప్రభాత్ ఝా నేతృత్వంలో ఓ సర్వే జరిగింది. అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మార్చి 2020 నుంచి జులై 2021 మధ్యకాలంలో చేపట్టిన ఆ సర్వేలో.. లక్షా 37వేల మంది నుంచి వివరాలు సేకరించారు.
ఆ సమయంలో చోటుచేసుకున్న మొత్తం మరణాల్లో దాదాపు 29శాతం అనగా.. 32లక్షల కొవిడ్ మరణాలు కొవిడ్ కారణంగానే జరిగినట్లు అంచనా వేశారు. కేవలం ఏప్రిల్-జులై 2021 మధ్యకాలంలోనే 27లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు లెక్కగట్టారు.
డబ్ల్యూహెచ్ఓ కూడా సవరించాల్సిందే..
వివిధ కారణాలతో సంభవించే మరణాలపై కొవిడ్‌కు ముందున్న సమాచారంతో పోలిస్తే.. 27శాతం పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. మరో అధ్యయనంలోనూ దాదాపు 57వేల మరణాలు (కొవిడ్‌తో, కొవిడ్ కానివి కలిపి) అధికంగా చోటుచేసుకున్నట్లు తేలినట్లు పరిశోధకులు వివరించారు. ఈ రెండు అధ్యయనాలు కూడా 2021లోనే జరిగినట్లు తెలిపారు. ఇలా జరిపిన రెండు అధ్యయనాల్లోనూ సెప్టెంబర్ 2021నాటికి దేశంలో అధికారికంగా గుర్తించిన కొవిడ్ మరణాల కంటే 6 నుంచి 7రెట్లు ఎక్కువగా సంభవించినట్లు తమ విశ్లేషణలో తేలిందని అధ్యయనకర్తలు వెల్లడించారు. కొవిడ్ మరణాలు నమోదు కాకపోవడానికి కొవిడ్ మరణ ధ్రువీకరణ, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన అంశాల్లో లోపాలు కారణమైనట్లు పేర్కొన్నారు.
ఒకవేళ ఇవే కనుక ధ్రువీకరణ ఐతే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కొవిడ్ మరణాల సంఖ్యను ఇందుకు అనుగుణంగా సవరించాల్సి ఉంటుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అయితే, భారత్‌లో కొవిడ్ మరణాలను కచ్చితంగా అంచనా వేయాలంటే ప్రత్యామ్నాయ విధానాలు అవసరమని తమ నివేదికలో పేర్కొన్నారు.
దేశంలో కొవిడ్ మరణాలను అంచనా వేసేందుకు పరిశోధకులు స్వయంగా సర్వే చేపట్టడంతోపాటు రెండు ప్రభుత్వ సమాచార నివేదికలను పరిగణనలోకి తీసుకున్నారు. తొలుత ప్రైవేట్ పోలింగ్ ఏజెన్సీ-సీఓటర్ సహాయంతో జాతీయ స్థాయిలో టెలిఫోనిక్ సర్వే నిర్వహించారు. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మరణాల నమోదు జాబితాతోపాటు పది రాష్ట్రాల్లోని మరణాల నమోదు పట్టిక (సీఆర్ఎస్)ను విశ్లేషించారు. తద్వారా కొవిడ్ మరణాలపై ఓ అంచనాకు వచ్చామని పరిశోధకులు పేర్కొన్నారు.
ఈ అధ్యయనంలో నొయిడాకు చెందిన సెంటర్ ఫర్ ఓటింగ్ ఒపీనియన్స్ అండ్ ట్రెండ్స్, ఐఐఎం అహ్మదాబాద్, వాషింగ్టన్‌కు చెందిన డెవెలప్‌మెంట్ డేటా ల్యాబ్, డార్ట్‌మౌత్ కాలేజీకి చెందిన బృందాలు పాల్గొన్నాయి.
ఇదీ చూడండి:రూ.1000కి ఫేక్ వ్యాక్సిన్ సర్టిఫికేట్- నిందితుడు అరెస్ట్