33 Lok Sabha MPs Suspended From Lok Sabha :పార్లమెంట్లో అసాధారణ పరిణామం! ఒకే రోజు ఉభయ సభల్లో 78 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారన్న కారణంతో 33 మంది ఎంపీలను లోక్‌సభ స్పీకర్ సస్పెండ్ చేశారు. అందులో 30 మందిపై శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని సభాపతి ప్రకటించారు. మరోవైపు, రాజ్యసభలో 45 మందిపై వేటు పడింది. అందులో 34 మందిపై శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగనుంది. ఇదివరకే పార్లమెంట్ నుంచి 14 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. సోమవారం నాటి సంఖ్యతో కలిపి ఇప్పటివరకు సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 92కు చేరింది.
సోమవారం సస్పెండ్ అయిన లోక్‌సభ సభ్యుల్లో కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, దయానిధి మారన్, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ తదితరులు ఉన్నారు. ఇందులో ముగ్గురు ఎంపీలు కే జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలీక్‌ను లోక్‌సభ ఘటనకు సంబంధించి సభా హక్కుల కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెండ్ చేశారు. మిగతా వారిపై శీతాకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సస్పెన్షన్‌కు సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిని వాయిస్ ఓటింగ్ ద్వారా ఆమోదింపజేశారు స్పీకర్.
మరోవైపు, రాజ్యసభ నుంచి 45 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రకటించారు. అందులో 34 మంది ఎంపీలు ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు సభకు హాజరు కాకూడదని స్పష్టం చేశారు. మిగిలిన 11 మంది ఎంపీల ప్రవర్తనపై ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం తీసుకోనుందని తెలిపారు. కమిటీ నివేదిక వచ్చేంత వరకు వారిపై సస్పెన్షన్ కొనసాగుతుందని ధన్‌ఖడ్ వివరించారు.
కాగా, లోక్‌సభలో సస్పెన్షన్‌పై కాంగ్రెస్ ఎంపీ అధీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"నాతో పాటు మరికొంతమంది ప్రతిపక్ష ఎంపీలను కూడా ఈరోజు సస్పెండ్ చేశారు. ఇటీవలే సస్పెండ్ అయిన మా ఎంపీలపై ఉన్న సస్పెన్షన్ వేటును ఎత్తివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ వ్యవహారంపై హోం మంత్రి వచ్చి ప్రకటన చేయాలి. ఆయన(హోం మంత్రి) ప్రతిరోజు టీవీల ముందు స్టేట్మెంట్స్ ఇస్తారు. పార్లమెంటులో భద్రతకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కూడా కాస్త సభలో చెబితే బాగుంటుంది. ప్రతిపక్షాల పట్ల వారు అనుసరిస్తున్న తీరు దారుణం. మేము చర్చను మాత్రమే కోరుకుంటున్నాము."
- అధీర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ ఎంపీ