సాధారణంగా వివాహమంటే భారీ ఖర్చు తప్పదు. అయితే వివాహ వేడుకల ఖర్చు భరించలేని పేదవారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారికోసం ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం గాజియాబాద్‌లో సామూహిక వివాహాలు జరిపించింది. ఈ వివాహ వేడుకలో వివిధ మతాలకు చెందిన 3,003 జంటలు ఒక్కటయ్యాయి. 'ముఖ్యమంత్రి సామూహిక్ వివాహ్ యోజన' కింద ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వేడుకలో ఒక్కటైనవారికి ప్రభుత్వం పెళ్లి దుస్తుల కోసం రూ.10,000 ఇవ్వగా.. వధువుల ఖాతాల్లోకి రూ.65,000 నగదు జమ చేయనుంది. గాజియాబాద్‌లోని నెహ్రూ పార్క్‌లో గురువారం జరిగిన సామూహిక వివాహ వేడుకకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అనిల్ రాజ్‌భర్, కేంద్ర సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ సహా పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ఒకేసారి 3,003 వివాహాలు.. స్పెషల్ గిఫ్టులు ఇచ్చి మరీ చేయించిన ప్రభుత్వం - యూపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో సామూహిక వివాహలు
ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన సామూహిక వివాహ వేడుకలో 3,003 జంటలు ఒక్కటయ్యాయి. ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్ సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సామూహిక వివాహ వేడుకలో గాజియాబాద్, హాపుడ్, బులంద్‌శహర్‌కు చెందిన 3,003 యువ జంటలు ఒక్కటయ్యాయి. ఇందులో 1,654 గాజియాబాద్.. 794 మంది హాపుడ్, 555 మంది బులంద్‌శహర్‌కు చెందిన జంటలని అధికారులు తెలిపారు. 1,850 జంటలు హిందువులు కాగా.. 1,147 ముస్లిం జంటలు ఉన్నాయి. బౌద్ధ, సిక్కు మతానికి చెందిన చెరో మూడు జంటలు సామూహిక వివాహ కార్యక్రమంలో భాగమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పేదలకు సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నామని కార్మిక శాఖ మంత్రి అనిల్ రాజ్‌భర్ అన్నారు.