తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాతో చనిపోయాడని అంత్యక్రియలు.. రెండేళ్లకు ప్రత్యక్షం.. అసలేమైంది? - కమలేష్​ పాటిదార్ తాజా వార్తలు

మధ్యప్రదేశ్​లోని ధార్​ జిల్లాలో ఓ వింత సంఘటన వెలుగు చూసింది. కరోనా కారణంగా చనిపోయాడని అనుకున్న వ్యక్తి రెండేళ్ల తర్వాత సజీవంగా తన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు.

Man Died To Corona Returned After 2 Years
మధ్యప్రదేశ్​లో కరోనాతో చనిపోయిన వ్యక్తి 2 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చాడు

By

Published : Apr 16, 2023, 4:33 PM IST

కరోనా సోకి చనిపోయాడని అనుకున్న వ్యక్తి.. అకస్మాత్తుగా రెండేళ్ల తర్వాత ప్రత్యక్షమయ్యాడు. 2021లో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన అతడికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా నిర్వహించారు. ఇప్పుడు అదే వ్యక్తి ఏకంగా రెండేళ్ల తర్వాత సజీవంగా తన కుటుంబ సభ్యులు ముందు ప్రత్యక్షమయ్యాడు. వినటానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నా.. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని ధార్​ జిల్లాలో వెలుగు చూసింది.

నిబంధనల కారణంగా గుర్తించలేకపోయారు..
మధ్యప్రదేశ్​ ధార్​ జిల్లా కరోడ్​ కలాన్​ గ్రామానికి చెందిన 30 ఏళ్ల కమలేశ్ పాటిదార్​ 2021లో కొవిడ్​-19 రెండో వేవ్​లో కరోనా వైరస్​ బారిన పడ్డాడు. దీంతో అతడిని గుజరాత్​ వడోదరాలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చేర్పించారు. కొద్దిరోజుల పాటు మహమ్మారితో పోరాడిన కమలేశ్.. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్​ కారణంగా మరణించినట్లు ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. ఆ సమయంలో కరోనా నిబంధనలు కఠినంగా ఉండటం వల్ల కమలేశ్​ మృతదేహాన్ని కూడా తాకలేని పరిస్థితి. ఈ నిబంధనలే చనిపోయింది ఎవరన్నది తెలియకుండా చేశాయి. అంత్యక్రియలకు ముందు శవాన్ని 20-25 అడుగుల దూరం నుంచి అతడి కుటుంబ సభ్యులకు చూపించారు. పైగా ఆస్పత్రి వర్గాలు కూడా కమలేశ్​ కరోనా కారణంగా చనిపోయాడని చెప్పడం వల్ల చనిపోయింది కమలేశే అని అనుకొని నిబంధనల ప్రకారం మృతదేహానికి స్వగ్రామంలో కాకుండా అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదిలా ఉంటే సరిగ్గా రెండేళ్లకి అంటే 2023, ఏప్రిల్​ 15న తన మేనమామ ఉండే బద్వేలి గ్రామానికి చేరుకున్నాడు కమలేశ్​. అతడిని చూసిన మామ ఒక్కసారిగా షాక్​కు గురయ్యాడు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ముందుగా కమలేశ్ భార్య సహా ఎవరూ ఈ విషయాన్ని నమ్మకపోవడం వల్ల వీడియో కాల్​ ద్వారా అతడితో మాట్లాడారు. దీంతో వెంటనే వారు కూడా కమలేశ్​ను చూడటానికి ఊరికి చేరుకున్నారు.

కమలేష్​ సజీవంగా తిరిగి రావడంతో ఆనందంలో కుటుంబం.

"కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నన్ను కిడ్నాప్​ చేశారు. గుజరాత్​లోని అహ్మదాబాద్‌లో నన్ను బందీగా ఉంచారు. అక్కడ నాకు మత్తు ఇంజెక్షన్​లు ఇచ్చేవారు. దీంతో నేను ఎప్పుడూ అపస్మారక స్థితిలోనే ఉండేవాడ్ని. శుక్రవారం కిడ్నాపర్లంతా అహ్మదాబాద్‌ నుంచి ఎక్కడికో కారులో బయలుదేరారు. ఇది తెలుసుకున్న నేను రహస్యంగా కారు డిక్కీలో దాక్కున్నాను. కొద్ది దూరం వెళ్లాక వారు టిఫిన్​ కోసం ఓ హోటల్​ దగ్గర కారు ఆపారు. ఇదే అదనుగా నేను వారి నుంచి తప్పించుకొని ఇందౌర్​ చేరుకున్నాను. అక్కడి నుంచి మా మామయ్య ఇంటికి వచ్చాను."
-కమలేశ్​ పాటిదార్​

ఈ మొత్తం వ్యవహారంపై దగ్గర్లోని సర్దార్‌పుర్ పోలీస్​ స్టేషన్​కు సమాచారం అందించారు కుటుంబ సభ్యులు. కానీ, కమలేశ్​ కరోడ్​ కలాన్​ గ్రామానికి చెందిన వ్యక్తి కావడం వల్ల కేసును అక్కడికి బదిలీ చేశారు పోలీసులు. ఏదేమైనా పూర్తిగా తమ నుంచి దూరమయ్యాడని అనుకున్న వ్యక్తి సజీవంగా తిరిగి రావడం వల్ల అతడి కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ABOUT THE AUTHOR

...view details