3 Year Old Boy Climbed Umling La Pass : మౌంట్ ఎవరెస్ట్‌కన్నా ఎత్తయిన పర్వతంపైకి వెళ్లొచ్చని అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు కర్ణాటకకు చెందిన ఓ బాలుడు. దక్షిణ కన్నడ జిల్లా సూలియాకు చెందిన జజీల్ రెహ్మాన్.. లద్ధాఖ్లోని ఉమ్లింగ్ లా పాస్‌కు బైక్‌పై వెళ్లొచ్చాడు. మూడున్నర ఏళ్ల వయసున్న జజీల్ సాధించిన ఘనతకు.. ఇండియన్ రికార్డ్ బుక్‌లో చోటు దక్కే అవకాశముంది.
జజీల్ తల్లిదండ్రులు.. తౌహీద్ రెహ్మాన్, జష్మియా. తౌహీద్‌కు ప్రయాణాలు చేయడం హాబీ. గతంలో స్నేహితులతో కలిసి కారులో భారత దేశం మొత్తం తిరిగారు. లద్ధాఖ్‌కు ఇప్పటికే 6 సార్లు వెళ్లొచ్చారు. అయితే.. ఈసారి మాత్రం కాస్త భిన్నమైన యాత్ర తలపెట్టారు. భార్య, కుమారుడితో కలిసి బైక్‌పై లద్ధాఖ్ వెళ్లి రావాలని నిర్ణయించుకున్నారు. ముగ్గురూ ఆగస్టు 15న సూలియాలో బయలుదేరారు. 19 రోజుల్లో దాదాపు 5వేల కిలోమీటర్లు ప్రయాణించి.. గత శనివారం లద్ధాఖ్లోని ఉమ్లింగ్ లాకు వెళ్లారు. అక్కడ జాతీయ జెండా, కర్ణాటక జెండా, తులునాడు జెండా ఆవిష్కరించారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రోడ్డు..
లద్ధాఖ్‌లో.. భారత్-చైనా సరిహద్దుకు సమీపంలో ఉండే ఉమ్లింగ్ లా ప్రాంతం.. భౌగోళికంగా ఎంతో సంక్లిష్టమైంది. ఉమ్లింగ్ లా.. సముద్ర మట్టానికి 19,024 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఎవరెస్ట్ శిఖరం ఎత్తు (17,498 అడుగుల) కంటే ఇదే అధికం. ఈ ప్రాంతంలో చిషుమ్లే నుంచి దెమ్చోక్ వరకు ఉండే 52 కిలోమీటర్ల రోడ్డు.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రహదారిగా పేరుగాంచింది. ఇక్కడ ఆక్సిజన్.. సాధారణ స్థాయితో పోల్చితే 43శాతం మాత్రమే ఉంటుంది. ఉష్ణోగ్రత మైనస్ 2 డిగ్రీలకన్నా తక్కువకు పడిపోతుంది. అలాంటి ప్రాంతానికి తల్లిదండ్రులతో కలిసి బైక్‌పై వెళ్లాడు జజీల్ రెహ్మాన్.