సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకం కోసం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం 9 మంది పేర్లను సిఫారసు చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ తొమ్మిది మందిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. 2027లో సుప్రీంకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉన్న కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ నాగరత్న, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది పేర్లను కేంద్రానికి కొలీజియం సిఫారసు చేసింది.
సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.టి. రవికుమార్, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏ.ఎస్.ఓకా, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్‌నాథ్ పేర్లను ప్రతిపాదించారు. సీనియర్ న్యాయవాదిగా సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న తెలుగు న్యాయవాది పి.ఎస్.నరసింహను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం ప్రతిపాదించింది. బార్ అసోసియేషన్ నుంచి జడ్జిగా అవకాశం దక్కించుకున్న 9వ న్యాయవాదిగా నరసింహా నిలవనున్నారు.
తొలి మహిళా సీజేఐ..
మరోవైపు కొలీజియం ప్రతిపాదించిన పేర్లలో జస్టిస్ బి.వి. నాగరత్న పేరును కేంద్రం ఆమోదిస్తే 2027లో.. ఆమె భారత తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. జస్టిస్ బి.వి. నాగరత్న తండ్రి.. జస్టిస్ ఈ.ఎస్ వెంకటరామయ్య కూడా.. 1989 జూన్ నుంచి 1989 డిసెంబరు వరకు సుప్రీంకోర్టు సీజేఐగా పని చేశారు. సుప్రీంకోర్టులో మహిళా ప్రధాన న్యాయమూర్తి ఉండాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వస్తున్నాయి. మాజీ సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే కూడా తన పదవీ విరమణకు ముందు ఈ విషయాన్ని ప్రస్తావించారు. మహిళా సీజేఐని నియమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.