అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే బంగాల్లో పెద్దఎత్తున హింస చెలరేగింది. తృణమూల్ కాంగ్రెస్ దాడుల్లో.. తమ పార్టీల కార్యకర్తలు ఆరుగురు మృత్యువాతపడ్డారని, పలువురు గాయపడ్డారని భాజపా ఆరోపించింది. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నారని పేర్కొంది. తాజా ఘర్షణలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించింది. వెంటనే తమకు నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఘర్షణల నేపథ్యంలో కార్యకర్తలకు సంఘీభావంగా తమ పార్టీ అధ్యక్షుడు జే.పీ.నడ్డా.. మంగళ, బుధవారాల్లో బంగాల్లో పర్యటించనున్నారని భాజపా నేత కైలాశ్ విజయవర్గియా చెప్పారు. బాధిత కుటుంబాలను పరామర్శించనున్నట్లు వెల్లడించారు.
బంగాల్లో సోమవారం జరిగిన ఘర్షణలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో భాజపా పలు వీడియోలను పంచుకుంది. నందిగ్రామ్‌లో తమ కార్యాలయంపై దాడి అనంతరం.. చెల్లాచెదురుగా పడిఉన్న పోస్టర్లు, పత్రాలు, ధ్వంసమైన ఫర్నీచర్‌ను ఓ వీడియోలో చూపించింది. హుగ్లీ జిల్లాలో భాజపా కార్యాలయానికి దుండగులు నిప్పంటించడం, ప్రజలు భయంతో పరుగులు తీయడం మరో వీడియోలో కనిపించింది. వస్త్ర దుకాణాన్ని కొందరు లూటీ చేసిన దృశ్యాలూ అందులో ఉన్నాయి. పలు ప్రాంతాల్లో గాయపడిన తమ పార్టీ కార్యకర్తల చిత్రాలను, మృతిచెందిన వారి ఫొటోలనూ కమలదళం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. నాలుగువేల మంది భాజపా మద్దతుదార్ల ఇళ్లను ధ్వంసం చేశారని తెలిపింది.
మరోవైపు.. తూర్పు బర్ధమాన్ జిల్లాలో ఆదివారం చెలరేగిన హింసలో తమ కార్యకర్తలు ముగ్గురు మరణించారని తృణమూల్ తెలిపింది. అక్కడ తమ మద్దతుదారుడొకరు మృత్యువాతపడ్డారని కాషాయం పార్టీ పేర్కొంది. రాష్ట్రంలో తాజా ఘర్షణలపై గవర్నర్ జగదీప్ ధన్కర్ స్పందించారు. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, డీజీపీలతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. వెంటనే శాంతి నెలకొనేలా చూడాలని వారిని ఆదేశించారు.
ఇదీ చదవండి:నాయకులకు నిబంధనలన్నీ నీటి మీద రాతలే!