డిగ్రీ కూడా పూర్తి చేయని ఓ ముగ్గురు విద్యార్థులు అరుదైన ఘనత సాధించారు. అంతరిక్షంలో ఓ గ్రహశకలాన్ని కనుగొన్నారు. వీరి కృషిని అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా) ప్రశంసించింది. వీరు కనుగొన్న ఆ గ్రహశకలంపై తాము పరిశోధన జరుపుతామని చెప్పింది.
9 నెలలపాటు..
గుజరాత్ అహ్మదాబాద్‌లోని ఎంజీ సైన్స్ కళాశాలలో నీరవ్ వాఘెలా, మైత్రీ మహేశ్వరి, ముంజల్ యాదవ్.. డిగ్రీ(జియాలజీ) మూడో ఏడాది చదువుతున్నారు. వీరు తొమ్మిది నెలలపాటు పరిశోధన చేసి, ఓ గ్రహశకలాన్ని కనుగొన్నారు. దానిని సెప్టెంబరు 20న ఐఏఎస్సీ-నాసా నిర్వహించిన 'ఆస్టరాయిడ్ హంటింగ్ కాంపిటీషన్'కు పంపారు. ఆ పోటీలో వీరు కనుగొన్న గ్రహశకలాన్ని నాసా గుర్తించింది.
ఆ 9 గ్రహశకలాల్లో..
ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 4,000 ప్రాథమిక గ్రహశకలాలను కనుగొన్నారు. వాటిలో మొత్తం 9 గ్రహశకలాలను నాసా గుర్తించగా... అందులో ఎంజీ సైన్స్ కళాశాల విద్యార్థులు కనుగొన్న గ్రహశకలం కూడా ఉంది. సూర్యుడి నుంచి దూరం, కక్ష్య సమయాన్ని నిర్ణయించిన ఏకైక గ్రహశకలం ఇదేనని నాసా ప్రశంసించింది. ఈ మేరకు విద్యార్థులకు సమాచారం అందించింది. ఈ గ్రహశకలానికి విద్యార్థుల(మైత్రి, నీరవ్, ముంజల్) పేరు మీదుగా 'ఎంఎన్ఎం0101' గా నామకరణం చేసినట్లు చెప్పింది.
2030 జులై 12న ఈ గ్రహశకలం.. భూమికి దగ్గరగా వస్తుందని నాసా తమకు మెయిల్ ద్వారా తెలియజేసిందని గ్రహశకల పరిశోధనలో పాల్గొన్న నీరవ్ వాఘెలా తెలిపారు. దీనిపై నాసా పరిశోధన చేయనుందని చెప్పారు.