ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని చాలామంది కలలు కంటారు. ఎంతో శ్రమిస్తే తప్ప.. ఏ కొద్ది మందికో తప్ప అందరికీ ఆ కల నెరవేరదు. మరి అలాంటిది ఒకే ఇంటి నుంచి ఐదుగురు అమ్మాయిలు.. ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు కదా? రాజస్థాన్ హనుమాన్గఢ్కు చెందిన ఐదుగురు తోబుట్టువులు మాత్రం ఈ అరుదైన ఘనత సాధించారు.
రాజస్థాన్ స్టేట్ అడ్మనిస్ట్రేటివ్ సర్వీస్(ఆర్ఏఎస్) పరీక్షలో అన్షు, రీతు, సుమన్ అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకేసారి ఉత్తీర్ణులయ్యారు. అయితే.. వారి మరో ఇద్దరు అక్కాచెల్లెళ్లు కుడా ఇప్పటికే ఆర్ఏఎస్ అధికారులుగా ఉండటం విశేషం. దాంతో ఇప్పుడు ఒకే ఇంటి నుంచి ఐదుగురూ ఆర్ఏఎస్ అధికారులుగా మారారు. ఈ విషయాన్ని ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రవీణ్ కాసవాన్.. ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ ముగ్గురు అక్కాచెలెళ్లకు అభినందిస్తూ వారి ఫొటోను పోస్ట్ చేశారు.
"రాజస్థాన్ హనుమాన్గఢ్కు చెందిన అన్షు, రీతు, సమన్.. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆర్ఏఎస్ అధికారులుగా ఎంపికయ్యారు. ఇదో మంచి వార్త. వీరు తమ తండ్రిని, కుటుంబాన్ని గర్వపడేలా చేశారు. వీరి మరో ఇద్దరు అక్కాచెల్లెళ్లు రోమా, మంజు ఇప్పటికే ఆర్ఏఎస్ అధికారులుగా ఉన్నారు. సహదేవ్ సహారన్ అనే రైతు బిడ్డలైన ఈ ఐదుగురూ ఇప్పడు ఆర్ఏఎస్ అధికారులే."
- ప్రవీణ్ కాసవాన్, ఐఎఫ్ఎస్ అధికారి