వైద్యేతర అవసరాల కోసం ద్రవీకృత ప్రాణవాయువు(లిక్విడ్ ఆక్సిజన్) వాడకంపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం.. ఒకరోజు అనంతరం తన నిర్ణయాన్ని సడలించింది. ఇంజక్షన్ సీసాల తయారీ(యాంప్యూల్స్, వయల్స్), ఫార్మా, రక్షణ రంగాల్లో లిక్విడ్ ఆక్సిజన్‌ను వినియోగించటానికి సోమవారం అనుమతులు తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. ఈ మూడు రంగాల వారు ఇకపై ఆక్సిజన్ వినియోగించవచ్చని స్పష్టం చేశారు.
దిల్లీ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆసుపత్రుల్లో మెడికల్ ఆక్సిజన్ కొరత వేధిస్తున్న నేపథ్యంలో వైద్య కోసం తప్ప మరే ఇతర అవసరాలకు లిక్విడ్ ఆక్సిజన్ వాడకూడదని అజయ్ భల్లా ఆదివారం స్పష్టం చేశారు. కొవిడ్ బాధితులకు ఇబ్బంది లేకుండా నిరంతంర ఆక్సిజన్ అందుబాటులో ఉంచడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.