3 Month Baby World Record :ఏవైనా గుర్తింపు పత్రాలు సంపాదించాలంటే అనేక కష్టాలు పడాల్సి ఉంటుంది. అధికారుల చుట్టూ తిరిగి అలిసిపోయి ఉంటారు. కానీ మధ్యప్రదేశ్ ఛింద్వాఢాకు చెందిన మూడు నెలల చిన్నారి.. ఆ గుర్తింపు పత్రాలతోనే ప్రపంచ రికార్డు సాధించింది. పుట్టిన 72 రోజుల్లోనే 31 రకాల ధ్రువపత్రాలు సాధించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. ఆమె కథేంటంటే?
ఇదీ కథ
ఛింద్వాడాలోని ఛందన్గావ్కు చెందిన కేసరి నందన్ సూర్యవన్షి, ప్రియాంక సూర్యవన్షి దంపతులిద్దరూ తపాలా శాఖలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరికి మూడు నెలల క్రితం శరణ్య సూర్యవన్షి అనే చిన్నారి జన్మించింది. అయితే, ఆమె పుట్టుక ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలని అనుకున్నారు తల్లిదండ్రులు. దీనికోసం ఏం చేయాలని అనేక రకాలుగా ఆలోచించారు. ఈ క్రమంలోనే ఓ రోజు వార్తల్లో గుర్తింపు పత్రాల గురించి విన్నారు. వెంటనే గుర్తింపు పత్రాలతో రికార్డు సృష్టించాలని నిశ్చయించుకున్నారు. దీనిపై వెతకగా.. 28 పత్రాలతో ఓ చిన్నారిపై ఈ రికార్డు ఉందని తెలుసుకున్నారు. ఆ రికార్డును బద్దలు కొట్టేందుకు చిన్నారి శరణ్య పేరుపై గుర్తింపు పత్రాలు సంపాదించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే జన్మించిన 72 రోజుల్లోనే 31 పత్రాలు సంపాదించిన శరణ్య.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది. అనంతరం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు దరఖాస్తు చేయగా.. అందులోనూ చోటు దక్కించుకుంది.