భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులున్నప్పటికీ ఇరు దేశాల సరిహద్దు రాష్ట్రాల ప్రజలు మాత్రం సత్సంబంధాలు కొనసాగిస్తుంటారు. రాజస్థాన్‌కు 90 కిలోమీటర్ల దూరంలో ఉండే బాడ్మేర్, జైసల్మేర్‌కు చెందిన ముగ్గురు యువకులు 2019లో పాకిస్థాన్ సింధ్ రాష్ట్రంలోని యువతులను పెళ్లాడారు. నెలరోజుల పాటు అక్కడే ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటన అనంతరం భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా దెబ్బతిన్నాయి.
ఈ ప్రభావం నూతన జంటలపై పడింది. పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చేందుకు ముగ్గురు యువకుల భార్యలకు ఇమిగ్రేషన్ అధికారులు వీసాలు మంజూరు చేయలేదు. కొద్ది రోజుల పాటు అక్కడే వేచి చూసిన రాజస్థాన్ యువకులు చేసేదేం లేక భార్యలను అక్కడే ఉంచి స్వదేశానికి వచ్చేశారు. రెండేళ్లయినా వారి భార్యలకు ఇంకా వీసాలు లభించలేదు. దీంతో తమ జీవిత భాగస్వాములు ఎప్పుడు వస్తారా? అని ముగ్గురు భర్తలు ఎదురు చూస్తున్నారు.
భార్యల వీసాల కోసం ముగ్గురు యువకులు రెండేళ్లుగా ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు భారత విదేశీ వ్యవహారాల శాఖ చొరవ తీసుకుని వీరి భార్యలను రాజస్థాన్ చేర్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.