తెలంగాణ

telangana

ETV Bharat / bharat

29 శాతం ఆహార వస్తువులు నాసిరకమే!

భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ విడుదల చేసిన 2018-19 వార్షిక నివేదిక ప్రకారం...దేశంలో 29 శాతం ఆహార వస్తువులు నాసిరకంగా ఉన్నట్లు వెల్లడైంది. ఇందులో.. తెలంగాణలో 10శాతం, ఏపీలో 14శాతం నమూనాలు నాసిరకమని తెలిసింది.

FSSAI_Report
'29 శాతం ఆహార వస్తువులు నాసిరకమే!'

By

Published : Nov 7, 2020, 9:37 AM IST

దేశంలో 29 శాతం ఆహార వస్తువులు నాసిరకంగా ఉన్నట్లు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ పరిశీలనలో తేలింది. తాజాగా విడుదలైన 2018-19 వార్షిక నివేదిక ప్రకారం ఆ సంస్థ దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 1,06,459 ఆహార వస్తువుల నమూనాలను పరీక్షించగా 30,415 నాసిరకంగా ఉన్నట్లు వెల్లడైంది. అందులో 3,900 ప్రమాదకరంగా, 16,870 నాణ్యతా లోపాలతో ఉన్నట్లు తేలింది.

మరో 9,645 నమూనాలు లేబిలింగ్‌, ఇతర లోపాలతోకూడి ఉన్నట్లు నిర్ధరణ అయింది. దీంతో 2,813 క్రిమినల్‌, 18,550 సివిల్‌ కేసులు నమోదుచేసింది. 701 మందికి శిక్షలు పడగా, 12,734మంది నుంచి జరిమానాల రూపంలో రూ.32.57 కోట్లు వసూలు చేసింది.

ఆయా రాష్ట్రాల్లో...

అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 52 శాతం నమూనాలు నాసిరకంగా ఉన్నట్లు తేలింది. ఇలాంటి వాటి శాతం ఆంధ్రప్రదేశ్‌లో 14, తెలంగాణలో 10 మేర ఉన్నట్లు వార్షిక నివేదిక ద్వారా వెల్లడైంది.

ఆంధ్రప్రదేశ్‌లో 4,715 నమూనాలను పరీక్షించగా అందులో 692 వస్తువులు ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది. వాటిల్లో 149 ప్రమాదకరంగా, 244 నాణ్యతా లోపంతో ఉన్నట్లు తేలింది. 104మందిపై క్రిమినల్‌, 456 మందిపై సివిల్‌ కేసులు నమోదు చేశారు. 29 మందికి శిక్షలు పడగా, 344 మంది నుంచి రూ.1.06 కోట్ల జరిమానా వసూలు చేశారు.

తెలంగాణ నుంచి సేకరించి పరీక్షించిన 1,760 నమూనాల్లో 168 ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది. అందులో 23 ప్రమాదకరంగా, 86 నాణ్యత లేమి, 59 లేబిలింగ్‌, ఇతర లోపాలతో ఉన్నట్లు వెల్లడైంది. 33 క్రిమినల్‌, 191 సివిల్‌ కేసులు నమోదుచేయగా, ముగ్గురికి శిక్ష పడింది. 15మంది నుంచి రూ.2.48 లక్షల జరిమానా వసూలుచేశారు.

ఇదీ చదవండి:ప్రపంచ అత్యుత్తమ శాస్త్రవేత్తల్లో ఐఐటీ గువాహటి పరిశోధకులు

ABOUT THE AUTHOR

...view details