కర్ణాటకలో కొలువుదీరనున్న కొత్త మంత్రివర్గంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు మొండిచెయ్యి లభించింది. యడ్డీ కుమారుడికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించినా నిరాశే ఎదురైంది. రాష్ట్ర మంత్రివర్గ కూర్పు తుది దశకు చేరుకుందని, యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర పేరు జాబితాలో లేదని కొత్త సీఎం బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు.
29 మంది ఎమ్మెల్యేలతో కొత్త కేబినెట్ రూపొందినట్లు సీఎం బసవరాజ్ తెలిపారు. మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రులుగా ఎవరినీ ఎంపిక చేయలేదు.
"దిల్లీ హైకమాండ్‌తో విస్తృత చర్చలు జరిపాను. అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే కేబినెట్‌పై నిర్ణయం తీసుకున్నాం. ఈ జాబితాను గవర్నర్‌కు పంపించాం. హైకమాండ్ నిర్ణయాన్ని అనుసరించి ఉపముఖ్యమంత్రులను ఎంపిక చేయలేదు. మంత్రుల ఎంపికలో ఎవరి ఒత్తిడీ లేదు. యడియూరప్పతో పార్టీ జాతీయ అధ్యక్షుడు మాట్లాడారు. కర్ణాటక ఇంఛార్జిగా ఉన్న అరుణ్ సింగ్ విజయేంద్రతో వ్యక్తిగతంగా చర్చించారు. విజయేంద్ర పేరు జాబితాలో లేదని మాత్రమే నేను చెప్పగలను."
-బసవరాజ్ బొమ్మై, కర్ణాటక ముఖ్యమంత్రి